జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: శాసనసభ నియోజకవర్గ ఎన్నికలలో పోలింగ్ రోజున జిల్లాలోని అర్హత గల ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఐ.బి. చౌరస్తాలో ఏర్పాటు చేసిన “నేను నవంబర్ 30న ఓటు వేస్తాను” కార్యక్రమంలో జిల్లా అదనపు పాలనాధికారి (రెవెన్యూ) సబావత్ మోతిలాల్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, మంచిర్యాల మున్సిపల్ కమీషనర్ మారుతి ప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన జిల్లాలోని 002-చెన్నూర్ (ఎస్.సి.), 003-చెన్నూర్ (ఎస్.సి.), 004-మంచిర్యాల నియోజకవర్గాలకు జరుగనున్న పోలింగ్ జిల్లాలోని అర్హత గల ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని తెలిపారు. పోలింగ్ రోజున ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని, ఖచ్చితంగా ఓటు వేయడంతో పాటు అర్హత గల వారందరు ఓటు వేసేలా అవగాహన కల్పించాలని తెలిపారు. రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కుతో దేశ స్థితిగతులను మార్చవచ్చని, సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా దేశాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి ఓటు విలువైనదేనని, రాజకీయ పార్టీలు, పోటీ చేయు అభ్యర్థులు చేసే ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్ఛందంగా, నిర్భయంగా, నిస్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకొని, సంక్షేమం, అభివృద్ధికి పాటు పడే నాయకులను ఎన్నుకోవాలని తెలిపారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం నమూనా ద్వారా ఓటు వేసే విధానంపై వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
