Monday, August 17, 2026
HomeTelanganaవలస ఓటర్లపై అభ్యర్థుల గురి

వలస ఓటర్లపై అభ్యర్థుల గురి

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, ముంబయి, పుణెల్లో భేటీలు, ఆత్మీయ సమ్మేళనాలు

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి సారించారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం ముంబయి, పుణె, భివండికి, పిల్లల చదువులు, మెరుగైన జీవనానికి హైదరాబాద్ నగరానికి వెళ్లిన ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. గ్రామాల వారీగా ఓటర్ల జాబితాలు తీసుకుని. ఆయా ఓటర్ల వివరాలు, చిరునామా తెలుసుకుంటున్నారు. వారికి ఫోన్ లు చేసి ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. ఈ నెల 30న పోలింగ్ రోజు గ్రామానికి వచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని హామీలిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన కొందరు అభ్యర్థులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి వలస ఓటర్లు అధికంగా ఉన్న ముంబయి, పుణెకు వెళ్లి అక్కడ సమావేశాలు నిర్వహించారు. వారం రోజుల్లో మరోదఫా ఆత్మీయ సమావేశాలు నిర్వహించడంతో పాటు గ్రామాలకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే అభ్యర్థులు కొందరు హైదరాబాద్ లో నివసిస్తున్న వలస ఓటర్లతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఓటుహక్కును గ్రామాల్లోనే వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ మరిన్ని సమావేశాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

• ఎక్కడి వారు.. ఎక్కడెక్కడ?

మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన కొందరు జీవనోపాధికి గతంలో ముంబయి, పుణె, భివండి ప్రాంతాలకు వలస వెళ్లి ఉపాధి పొందుతున్నారు. వీరంతా ఓటు హక్కును తెలంగాణలోని తమ సొంత గ్రామాల్లోనే వినియోగించుకుంటున్నారు. నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన పలు కుటుంబాలు హైదరాబాద్ చుట్టూ విస్తరించిన కాలనీల్లో నివసిస్తున్నాయి. పూర్వ నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ప్రజలు ఎక్కువగా ఎల్బీనగర్, సాగర్ రోడ్, బీఎన్ రెడ్డి నగర్ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు.

• ఇవీ.. కొన్ని ఉదాహరణలు

వనపర్తికి చెందిన ఓ పార్టీ అభ్యర్థి ఇప్పటికే ఒకసారి ముంబయిలోని వలస ఓటర్లను సమీకరించి సమావేశం నిర్వహించారు. వారు ఓటేసేందుకు రావడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

కొడంగల్ కు చెందిన మరో నాయకుడు ముంబయి, పుణె లలో సమావేశాలు నిర్వహించారు. నామినేషన్ వేశాక. ఆయన ఇటీవల మరోసారి భేటీ అయ్యారు.

నారాయణపేటకు చెందిన అభ్యర్థి. వలస ఓటర్లు ఎక్కువగా ఉండే గ్రామాలు, మండల నాయకులతో ముంబయి వెళ్లి అక్కడ వారిని కలిసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.