ఆసిఫాబాద్ అక్టోబర్ 30, ( ఆంజనేయులు న్యూస్ )
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని ముత్తంపేట్ గ్రామ పంచాయతీలో ఏడేళ్లుగా పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న మూగ, చెవిటి వ్యక్తి దుర్గం బండును సర్పంచ్ భర్త మోతిరామ్ అకారణంగా విధుల నుంచి తొలగించారని ఆరోపిస్తూ ఆయన కుటుంబ సభ్యులు కౌటాల ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంధురాలైన భార్య, ముగ్గురు కూతుళ్లు, కుమారుడితో కలిసి బండు కార్యాలయం ఎదుట బైఠాయించి తమకు న్యాయం చేయాలని కోరారు. మాటలు రాని, వినికిడి లోపం ఉన్న తనను అన్యాయంగా విధుల నుంచి తొలగించారని బండు సంజ్ఞల ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు. పంచాయతీ నుంచి వచ్చే జీతంతోనే కుటుంబం జీవనం సాగుతోందని, ఉన్నట్టుండి ఉద్యోగం తొలగించడంతో కుటుంబం రోడ్డున పడిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఏడేళ్లుగా పనిచేస్తున్న కార్మికుడిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని వారు అధికారులను డిమాండ్ చేశారు.
• ప్రకటన

ఆంజనేయులు న్యూస్ – వ్యాపార ప్రకటన
