నాటు బాంబు పేలుడుతో దవడ ఛిద్రమై తీవ్రంగా గాయపడిన ఎద్దు.
ఖానాపూర్, అక్టోబర్ 30 ( ఆంజనేయులు న్యూస్ )
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అడవిలో మేతకు వెళ్లిన ఓ ఎద్దు అడవి పందుల కోసం అమర్చిన నాటు బాంబు (గోలిమందు) తినడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించి దాని దవడ భాగం పూర్తిగా ఛిద్రమైంది. గ్రామానికి చెందిన దెబ్బడి రాజేశ్వర్‌కు చెందిన ఎద్దు శుక్రవారం సాయంత్రం అడవి ప్రాంతంలో మేత మేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అడవి పందులను వేటాడేందుకు గుర్తుతెలియని వ్యక్తులు అమర్చిన గోలిమందును ఎద్దు తినడంతో అది ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఎద్దు దవడ భాగం తీవ్రంగా దెబ్బతిని, అధిక రక్తస్రావంతో విలవిలలాడింది. సమాచారం తెలుసుకున్న యజమాని వెంటనే పశువైద్యుడిని పిలిపించి చికిత్స చేయించారు. అయితే గాయం తీవ్రంగా ఉండటంతో ఎద్దు ప్రాణాలతో బయటపడటం కష్టమని వైద్యుడు తెలిపినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అడవి పందుల వేట కోసం అడవుల్లో ఇష్టానుసారంగా నాటు బాంబులు అమర్చడం వల్ల మూగజీవాల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణులను లక్ష్యంగా చేసుకుని పెట్టే గోలిమందు పశువులకు ప్రాణాంతకంగా మారుతోందని, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనపై శుక్రవారం ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు, అలాగే అటవీ శాఖ అధికారుల దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్తానని బాధితుడు దెబ్బడి రాజేశ్వర్ తెలిపారు.
• ప్రకటన •

మీ వ్యాపార, ఇతర ప్రకటనల ప్రచురణ కోసం సంప్రదించండి – ఆంజనేయులు న్యూస్.
