లక్షెట్టిపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న అంకతి శ్రీనివాస్. పాల్గొన్న మేయర్ దర్నీ మధుకర్, కాంగ్రెస్ నాయకులు.
మంచిర్యాల, అక్టోబర్ 23, ( ఆంజనేయులు న్యూస్ )
తన చివరి కట్టే కాలే వరకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వెంటే ఉంటానని జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. శుక్రవారం లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని స్థానిక విశ్రాంతి భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. దసరా ఉత్సవాల సందర్భంగా మంతెన జగన్ మోహన్ రావు వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు వెంకట్రావుపేట గ్రామంలోని తన ఇంటికి వచ్చి, తనకు మద్యం తాగించి వారి వాహనాల్లో మంచిర్యాలకు తీసుకెళ్లారని శ్రీనివాస్ ఆరోపించారు. అక్కడి నుంచి వివిధ వాహనాల్లో మంచిర్యాల, కరీంనగర్ ప్రాంతాలకు తిప్పుతూ తీవ్ర చిత్రహింసలకు గురిచేశారని పేర్కొన్నారు. అనంతరం హైదరాబాద్‌కు తీసుకెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు ఫోన్ చేయగా, ఆయన తనను రక్షించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ పదవులు దక్కేలా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఎంతో కృషి చేశారని, అలాంటి నాయకుడి సేవలను కొందరు మరిచిపోతున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. తమ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. దమ్ము, ధైర్యం ఉంటే నేరుగా వచ్చి తేల్చుకోవాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాలు, చీలికల వ్యవహారంపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు స్పందించకపోవడంపై నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల సహకారంతోనే కాంగ్రెస్‌లో చీలికలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అనంతరం అంకతి శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురిపై నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సమావేశంలో మంచిర్యాల మేయర్ దర్నీ మధుకర్, జెండా వెంకటాపూర్ సహకార సంఘం చైర్‌పర్సన్ చల్లా నాగభూషణం, మంచిర్యాల, లక్షెట్టిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లు రామగిరి బానేష్, అక్కల వెంకటేశ్వర్లు, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు పూదరి తిరుపతి, నాయకులు త్రిమూర్తి, షాహిద్ అలీ, ఆరీఫ్, పింగళి రమేష్, నర్సయ్య, పూర్ణ చందర్ రావు, నలిమేల రాజు, తీర్థాల వెంకటేష్, సందెల సురేష్, చింత అశోక్, గోప చిన్న రమేష్ తదితరులు పాల్గొన్నారు.
