మంచిర్యాల అక్టోబర్ 9, ( ఆంజనేయులు న్యూస్ )
మంచిర్యాల పట్టణంలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్ – CBSEలో బతుకమ్మ పండుగ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని విద్యార్థినులు రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను పేర్చి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ రినెట్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ప్రకృతిపై ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఇటువంటి పండుగల నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవం పెరుగుతుందని, వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. అనంతరం వైస్ ప్రిన్సిపాల్ సిస్టర్ కృప బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పూలతో అలంకరించిన బతుకమ్మలు, సంప్రదాయ పాటలతో పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహనను, ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించింది.
