అసత్య కథనాలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం సరికాదు
వాస్తవాలు తెలుసుకుని వార్తలు ప్రచురించాలి
పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే అసత్య కథనాలను ఖండించిన ఎస్పీ జానకి షర్మిల
నిర్మల్, ఆగస్టు 11, ( ఆంజనేయులు న్యూస్ )
నిర్మల్ జిల్లాలో జరుగుతున్న దొంగతనాలను గోరంతలు కొండంతలు చేస్తూ ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా అసత్య కథనాలు ప్రచురించడం సరికాదని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS అన్నారు. వాస్తవాలను పూర్తిగా పరిశీలించకుండా ఏకపక్షంగా ప్రచురించే కథనాలు పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో నేరాల నియంత్రణతో పాటు ఇప్పటికే జరిగిన నేరాలను ఛేదించేందుకు పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారని ఎస్పీ తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, నిందితుల కదలికలు, గత నేరాల వివరాలను విశ్లేషిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.
• వారం రోజుల్లో 20 ఆస్తి నేరాల ఛేదన:
ఆస్తి నేరాల నియంత్రణ, కేసుల ఛేదన కోసం రెండు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ బృందాలు ప్రత్యేకంగా పనిచేస్తూ వారం రోజుల్లో 20 ఆస్తి నేరాల కేసులను ఛేదించగా, మరో 15 కేసుల్లో కీలక ఆధారాలు సేకరించినట్లు వెల్లడించారు. బైంసా టౌన్, నిర్మల్ టౌన్, నిర్మల్ రూరల్, మామడ, సారంగాపూర్, లక్ష్మణచాంద, తానూర్, కడెం తదితర ప్రాంతాల్లో నమోదైన ఇంటి దొంగతనాలు, ఆలయ చోరీలు, ద్విచక్ర వాహనాలు, కాపర్ వైర్ చోరీలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
• కడెంలో ఐదు కేసుల ఛేదన:
కడెం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఐదు దొంగతనం కేసులను పోలీసులు ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కేసులకు సంబంధించిన ఆధారాలను సేకరించి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
• 48 గంటల్లో హుండీ చోరీ కేసు ఛేదన:
బైంసా టౌన్ పరిధిలోని పోచమ్మ ఆలయంలో జరిగిన హుండీ చోరీ కేసును కేసు నమోదైన 48 గంటల్లోనే ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బాలుడు కావడంతో చట్టపరమైన నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టారు.
• 13 ప్రత్యేక చెక్‌పోస్టులతో నిఘా:
దొంగతనాలను అరికట్టేందుకు జిల్లాలో 13 ప్రత్యేక పోలీస్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. బైంసా టౌన్‌లో ఐదు, నిర్మల్ టౌన్‌లో ఏడు, సారంగాపూర్‌లో ఒక చెక్‌పోస్టు ఏర్పాటు చేసి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణను పటిష్టం చేయడంతో పాటు గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు.
• నేరం జరిగిన తర్వాతే కాదు.. ముందే అడ్డుకుంటాం:
నేరం జరిగిన తర్వాత కేసును ఛేదించడమే కాకుండా నేరాలు జరగకుండా ముందస్తు చర్యలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. నిరంతర గస్తీ, ప్రత్యేక తనిఖీలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, పాత నేరస్తులపై నిఘా వంటి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
• పెద్ద నేర ముఠాపై ప్రత్యేక దృష్టి:
జిల్లాలో ఇటీవల జరిగిన పలు ఆస్తి నేరాలకు సంబంధించి ఒక పెద్ద నేర ముఠా కదలికలపై ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ముఠా సభ్యుల కదలికలు, గత నేరాలతో ఉన్న సంబంధాలను సాంకేతిక ఆధారాలతో విశ్లేషిస్తున్నామని తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు పూర్తి వివరాలను వెల్లడించడం సాధ్యం కాదని, కేసులు కొలిక్కి వచ్చిన వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని మరిన్ని కేసులను ఛేదించే దిశగా చర్యలు చేపడతామని చెప్పారు.
• గంజాయి అక్రమ రవాణాపైనా నిఘా
జిల్లాలో గంజాయి వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచి కేసులు నమోదు చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
• బాధ్యతాయుత జర్నలిజం అవసరం:
వార్తలు ప్రచురించే ముందు సంబంధిత అధికారులను సంప్రదించి వాస్తవాలను తెలుసుకోవాలని ఎస్పీ సూచించారు. అధికారుల వివరణను కూడా వార్తల్లో సముచితంగా ప్రచురించడం బాధ్యతాయుత జర్నలిజం పద్ధతి అని అన్నారు. పోలీస్ శాఖపై వాస్తవ ఆధారాలతో చేసే విమర్శలను స్వాగతిస్తామని, అయితే అసత్యాలు, నిరాధార ఆరోపణలు, వాస్తవాలను వక్రీకరించే కథనాలు ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు కలిగించడంతో పాటు పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందన్నారు. ఇలాంటి అసత్య, నిరాధార కథనాలు కొనసాగితే అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాల ద్వారా తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డా. జి. జానకి షర్మిల స్పష్టం చేశారు.
• ప్రజలకు పోలీసుల సూచనలు:
ప్రజలు తమ ఇళ్లు, దుకాణాలు, వ్యాపార సంస్థలు, ఆలయాలు, ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు ఆస్తి నేరాల ఛేదనపై నిరంతరం పనిచేస్తున్నాయి. బైంసా ASP సాయి కిరణ్, IPS ఒక టాస్క్‌ఫోర్స్‌కు, నిర్మల్ DSP పి. శ్రీనివాస్ మరో టాస్క్‌ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. నేరాల నియంత్రణ, కేసుల త్వరితగతిన ఛేదన, ప్రజల ఆస్తి, ప్రాణాలకు భద్రత కల్పించడమే నిర్మల్ పోలీసుల ప్రధాన లక్ష్యమని ఎస్పీ స్పష్టం చేశారు.
