కార్మికులకు అవగాహన.. 41 వాహనాలు సీజ్: ఏసీపీ వెంకటేశ్వర్లు
మంచిర్యాల, జూలై 17, ( ఆంజనేయులు న్యూస్ )
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ జైపూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో జైపూర్ ఎస్టీపీ ప్లాంట్ లేబర్ క్యాంపులో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. కార్మికుల నివాస బ్యారక్‌లను పరిశీలించిన పోలీసులు మొత్తం 41 వాహనాలను సీజ్ చేశారు. వీటిలో 22 ద్విచక్ర వాహనాలు, 6 మినీ బస్సులు, 9 ట్రాలీ వాహనాలు, 4 ఆటోలు ఉన్నాయి. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు జైపూర్ ఇన్స్పెక్టర్ నవీన్, ఎస్ఐ భూమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు హాజరై ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల కార్మికులు తమ స్వగ్రామ పరిధిలోని పోలీస్ స్టేషన్ నుంచి తమపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని తెలిపే ఎన్ఓసీ (No Objection Certificate) తీసుకువచ్చి స్థానిక పోలీస్ స్టేషన్లో సమర్పించాలని సూచించారు. అలాగే కార్మికులు నివసించే బ్యారక్ల పరిసరాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్లాంట్ యాజమాన్యానికి ఆదేశించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, వాటి వినియోగం, కొనుగోలు, విక్రయం, రవాణా వంటి చర్యల్లో పాల్గొంటే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నా లేదా అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు స్థానిక చట్టాలను గౌరవిస్తూ ప్రశాంత వాతావరణంలో జీవించాలని, ఆధార్ కార్డు, గుర్తింపు పత్రాలు ఎల్లప్పుడూ తమ వద్ద ఉంచుకోవడంతో పాటు యాజమాన్యం వద్ద పూర్తి వివరాలు నమోదు చేయించాలని సూచించారు. మద్యం సేవించి గొడవలకు దిగడం, అసాంఘిక లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు. సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. మోసపూరిత కాల్స్ లేదా సందేశాలు వచ్చిన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. ప్రజల భద్రత, నేరాల నివారణ కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ప్రతి కార్మికుడు చట్టాలను పాటిస్తూ పరస్పర సహకారంతో పనిచేస్తే సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.
