బాధితుడికి నగదు అందజేస్తున్న జన్నారం ఎస్‌ఐ ఉదయ్ కిరణ్, పోలీసు సిబ్బంది.
మంచిర్యాల, జూలై 14, ( ఆంజనేయులు న్యూస్ )
మూర్ఛతో అపస్మారక స్థితిలో పడిపోయిన వ్యక్తికి సకాలంలో వైద్యం అందించి ప్రాణాలు కాపాడటమే కాకుండా, అతని వద్ద ఉన్న రూ.1.08 లక్షల నగదును భద్రపరిచి కుటుంబ సభ్యుల సమక్షంలో తిరిగి అప్పగించి జన్నారం పోలీసులు నిజాయితీ, మానవత్వాన్ని చాటుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 12న రాత్రి 10:37 గంటల సమయంలో ఓ వ్యక్తి మూర్ఛ వచ్చి నోటి నుంచి నురుగు వస్తూ అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని బ్లూ కోల్ట్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ దేవన్న, హోంగార్డ్ నీలయ్య గమనించారు. వెంటనే జన్నారం పోలీస్ స్టేషన్ ఎస్సై ఉదయ్ కిరణ్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్సై ఉదయ్ కిరణ్ వెంటనే స్పందించి ప్రైవేట్ అంబులెన్స్ ఏర్పాటు చేసి బాధితుడిని లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు చేపట్టారు. అనంతరం బాధితుడు పడిఉన్న ప్రాంతాన్ని పరిశీలించగా అక్కడ ఉన్న కవర్‌లో రూ.1,08,000 నగదు లభ్యమైంది. నగదును భద్రపరిచిన జన్నారం పోలీసులు, బాధితుడి వివరాలు ఆరా తీయగా అతను లోతేరా గ్రామానికి చెందిన కుర్సెంగా దేవరావుగా గుర్తించారు. మంగళవారం లోతేరా గ్రామ సర్పంచ్ బోడ శంకర్ సమక్షంలో కుర్సెంగా దేవరావుకు రూ.1.08 లక్షల నగదును జన్నారం పోలీసులు అప్పగించారు. తన ప్రాణాలను కాపాడటంతో పాటు పోయిందనుకున్న డబ్బును కూడా తిరిగి అందుకోవడంతో దేవరావు భావోద్వేగానికి గురయ్యారు. ఎస్సై ఉదయ్ కిరణ్, బ్లూ కోల్ట్ సిబ్బంది, జన్నారం పోలీసులకు జీవితాంతం రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ, రాత్రి వేళల్లో ప్రజలు పెద్ద మొత్తంలో నగదును వెంట తీసుకెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.




