Monday, July 13, 2026
Home Crime “ఏసీబీ దాడులు చేస్తాం”.. బెదిరించి ఆర్‌ఐకి కుచ్చుటోపీ

“ఏసీబీ దాడులు చేస్తాం”.. బెదిరించి ఆర్‌ఐకి కుచ్చుటోపీ

0
9995

📰 Generate e-Paper Clip

“నీపై ఏసీబీ కేసులు ఉన్నాయి” అంటూ బెదిరింపు.. భయంతో ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేసిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్.. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

సిద్దిపేట జూలై 12, ( ఆంజనేయులు న్యూస్ )

ఇటీవల సిద్దిపేట జిల్లా చేర్యాల తహసీల్దార్ ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, అదే పరిస్థితిని ఆసరాగా చేసుకున్న సైబర్ కేటుగాళ్లు రెవెన్యూ అధికారులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా చేర్యాల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) తలారి ఐలయ్యను ఏసీబీ అధికారులమంటూ నమ్మబలికి రూ.96 వేల మేరకు సైబర్ మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గురువారం ఆర్‌ఐ ఐలయ్యకు గుర్తుతెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను ఏసీబీ డీఎస్పీ అని పరిచయం చేసుకుంటూ, “నీపై పలు అవినీతి ఫిర్యాదులు ఉన్నాయి. త్వరలో నీ కార్యాలయం, ఇంటిపై ఏసీబీ దాడులు జరుగుతాయి” అంటూ తీవ్రంగా బెదిరించాడు. అనూహ్యంగా వచ్చిన ఈ కాల్‌తో తీవ్ర ఆందోళనకు గురైన ఐలయ్య, తన పేరును కేసుల నుంచి తొలగించాలని వేడుకోగా, “వ్యవహారం సెటిల్ చేయాలంటే వెంటనే రూ.1 లక్ష పంపాలి” అని నకిలీ అధికారి డిమాండ్ చేశాడు. ఉద్యోగం కోల్పోతాననే భయం, ఏసీబీ దాడులతో పరువు పోతుందనే ఆందోళనలో ఉన్న ఆర్‌ఐ, ఎలాంటి నిర్ధారణ చేసుకోకుండా కేటుగాడు సూచించిన మొబైల్ నంబర్‌కు ఆన్‌లైన్ ద్వారా రూ.96 వేలును బదిలీ చేశారు. డబ్బు పంపిన అనంతరం అదే నంబర్‌కు పలుమార్లు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ రావడంతో తాను మోసపోయినట్లు గ్రహించారు. వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించి, కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తమను తాము ప్రభుత్వ సంస్థల అధికారులమంటూ బెదిరించి డబ్బు అడిగే వ్యక్తులను నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.