Sunday, August 23, 2026
HomeTelanganaనులిపురుగుల నిర్మూలనకు జిల్లావ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు

నులిపురుగుల నిర్మూలనకు జిల్లావ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు

📰 Generate e-Paper Clip

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ

( మంచిర్యాల జులై 6, ఆంజనేయులు న్యూస్ )

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఈ నెల 13న మంచిర్యాల జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో విడుదల చేశారు. ప్రజల్లో, ముఖ్యంగా తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి ఆల్బెండజోల్ మాత్రలు అందజేస్తామని చెప్పారు. జిల్లాలోని 930 అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులతో పాటు గ్రామాల్లోని 19 ఏళ్లలోపు పిల్లలకు ఆశా కార్యకర్తల ద్వారా మాత్రలు తినిపించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 1,58,480 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, ఐసీడీఎస్, పంచాయతీరాజ్, మున్సిపల్, జిల్లా సంక్షేమ శాఖల సమన్వయంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నులిపురుగుల వల్ల పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత, అలసట, శారీరక ఎదుగుదల మందగించడం, మానసిక అభివృద్ధి దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. అందుకే ప్రతి చిన్నారికి తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్ర వేయించాలని సూచించారు. వయస్సును బట్టి మాత్రల మోతాదు ఇలా ఉంటుందని వివరించారు. ఒకటి నుంచి రెండు సంవత్సరాల లోపు పిల్లలకు అర మాత్ర, రెండు నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు ఒక మాత్రను పొడిచేసి, మూడు నుంచి 19 సంవత్సరాల పిల్లలకు ఒక ఆల్బెండజోల్ మాత్రను నమిలి తినిపించాలన్నారు. ఈ మాత్రలు పూర్తిగా సురక్షితమైనవని, అయితే పాఠశాలలు లేదా అంగన్వాడీ కేంద్రాల్లోనే తినిపించాలని, ఇంటికి పంపించరాదని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అలాగే భోజనం చేసే ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా నులిపురుగుల బారిన పడకుండా ఉండవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ భీష్మ, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ రవి, డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ అరుణశ్రీ, డాక్టర్ అనిల్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, రషీద్, ఆర్‌.ఎస్‌. పద్మ, డీపీఓ శ్రీమతి ప్రశాంతి, సుమన్, సురేందర్‌తో పాటు ఆర్‌బీఎస్‌కే వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయించి నులిపురుగుల నుంచి రక్షణ కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పిలుపునిచ్చింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.