కాలుష్యంతో ప్రజలకు ఇబ్బందులు, పట్టించుకోని పోలీసులు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలో “స్మోకింగ్ జోన్”ల పేరుతో యువతను తప్పుదోవ పట్టిస్తున్న ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని కొన్ని కేఫ్‌లు, టీ షాపుల్లో ప్రత్యేక గదులు ఏర్పాటు చేసి వాటిని స్మోకింగ్ జోన్‌లుగా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రదేశాల్లో యువత సిగరెట్లకు అలవాటు పడుతూ, మొబైల్ ఫోన్లలో ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసలవుతున్నారని చెబుతున్నారు. దీని ప్రభావంతో వారి చదువు, భవిష్యత్తు దెబ్బతింటోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొన్ని స్మోకింగ్ పాయింట్ల వద్ద డ్రగ్స్ వినియోగానికి కూడా అవకాశం కల్పిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో యువత మానసికంగా, శారీరకంగా తీవ్రంగా దెబ్బతింటున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, ఈ స్మోకింగ్ జోన్‌ల వల్ల వెలువడుతున్న పొగ, దుర్వాసన కారణంగా సమీపంలోని ఇళ్లలో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలకు గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. కాలుష్యం పెరిగి పరిసరాల వాతావరణం కూడా దెబ్బతింటోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత పోలీస్ అధికారులు మాత్రం సరైన చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వెంటనే తనిఖీలు నిర్వహించి, అక్రమంగా నడుస్తున్న స్మోకింగ్ పాయింట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
