చాకచక్యంగా ఎండోస్కోపీ చేసి కాపాడిన డాక్టర్ నవీన్ ఆడెపు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: అప్రమత్తతతో వైద్యుడు ప్రాణాపాయం నుంచి బాలుడిని కాపాడిన ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్‌కు చెందిన 16 ఏళ్ల బాలుడు నిఖిల్ పాఠశాలలో అనుకోకుండా పెన్ క్యాప్‌ను మింగాడు. అది గొంతులో ఇరుక్కొని శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. బాలుడి పరిస్థితి విషమించడంతో తల్లిదండ్రులు వెంటనే మంచిర్యాలలోని కాకతీయ గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ విధుల్లో ఉన్న గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ నవీన్ ఆడెపు అత్యవసరంగా పరీక్షించి, ఎండోస్కోపీ ద్వారా గొంతులో ఇరుక్కున్న పెన్ క్యాప్‌ను చాకచక్యంగా తొలగించారు. సమయానికి చికిత్స అందడంతో బాలుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకుని వైద్యుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ నవీన్ ఆడెపు మాట్లాడుతూ, చిన్నపిల్లలు నోళ్లలో పెన్ క్యాప్‌లు లేదా చిన్న వస్తువులు పెట్టుకుని ఆడటం ప్రమాదకరమని హెచ్చరించారు. ఇటువంటి నిర్లక్ష్యం ప్రాణాపాయ పరిస్థితులకు దారితీస్తుందని, పిల్లలపై తల్లిదండ్రులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
