హోలీ ఆడిన కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ డా.జి. జానకి షర్మిల

ఆంజనేయులు న్యూస్, నిర్మల్ జిల్లా: రంగుల పండుగ హోలీ సందర్భంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం రంగుల కాంతులతో కళకళలాడింది. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మరియు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల స్వయంగా హోలీ వేడుకల్లో పాల్గొని అధికారులతో కలిసి రంగులు చల్లుకున్నారు. క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఏఎస్పీ సాయికిరణ్, డీఎఫ్‌ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అధికారుల సందడితో కార్యాలయ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ హోలీ పండుగ సౌహార్దత, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో ఆనందం, ప్రేమాభిమానాలు పెంపొందించే ఈ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా, సురక్షితంగా జరుపుకోవాలని సూచించారు.
