
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా, తాండూర్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కాసిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం సర్పంచ్ అష్ప రమేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తెలంగాణ అవతరించి 10 వసంతాలు పూర్తి చేసుకుని సాధించిన విజయాలను, సామాజిక వర్గాల సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకెళ్లే దిశగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అష్ప రమేష్ మాట్లాడుతూ.. ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని తెలిపారు. గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వైభవం దేశం నలుదిశలా వ్యాప్తి చెందినదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్స్, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్స్ మరియు గ్రామీణ వాసులు తదితరులు పాల్గొన్నారు.
