Tuesday, August 18, 2026
HomeTelanganaబిడ్డా.. లేనిపోని అనుమానంతో చనిపోతివి.. ఇప్పుడు గిన్ని మార్కులతో పాసయితీవి

బిడ్డా.. లేనిపోని అనుమానంతో చనిపోతివి.. ఇప్పుడు గిన్ని మార్కులతో పాసయితీవి

📰 Generate e-Paper Clip

ఫలితాలు వెలువడక ముందే భయంతో ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థి ఏ గ్రేడ్ లో ఉత్తీర్ణుడైన ఘటన స్థానికుల హృదయాలను కలచివేసింది.

ఆంజనేయులు న్యూస్, మహబూబాబాద్ జిల్లా: ఫలితాలు వెలువడక ముందే భయంతో ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థి ఏ గ్రేడ్ లో ఉత్తీర్ణుడైన ఘటన స్థానికుల హృదయాలను కలచివేసింది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పిక్లా తండా శివారు బోడగుట్ట తండాకు చెందిన ఇంటర్ విద్యార్థి గుగులోతు కృష్ణ(19) మంగళవారం వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో (బైపీసీ విభాగం) 892/1000 మార్కులు సాధించి ఏ గ్రేడ్ ఉత్తీర్ణుడయ్యాడు.
అయితే, కృష్ణ గత నెల 10న తాను బాగా చదవలేకపోయానని, లక్ష్యసాధనలో వెనుకబడుతున్నానని లేఖరాసి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ, ఇవాళ వెలువడిన ఫలితాల్లో అత్యున్నత మార్కులతో ఉత్తీర్ణుడైన విషయం తెలుసుకొని.. కృష్ణ జీవితంలో ఫెయిల్ అయ్యాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ‘కొడుకా లేనిపోని అనుమానంతో ఉరేసుకొని చనిపోతివి… ఇప్పుడు ఇంటర్ పరీక్షల్లో గిన్ని మార్కులతో పాసయితివి’ అంటూ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.

• అమ్మానాన్న క్షమించండి..

బోడగుట్ట తండాకు చెందిన గుగులోతు లచ్చు, జ్యోతి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు కృష్ణ(19) కల్వల ఆదర్శ పాఠశాలలో పదోతరగతి వరకు పూర్తి చేసి ఏటూరు నాగారంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ బైపీసీలో చేరాడు. ఇటీవల పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు. కృష్ణ చిన్నప్పటి నుంచి ఎంబీబీఎస్ చేయాలనే కోరికతో కష్టపడి చదువుతున్నాడు. ఈ క్రమంలోనే ఇంటర్ పూర్తి చేసి నీట్ పరీక్షకు సన్నద్ధమయ్యాడు. ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నానని అతనిలో నిరాశ మొదలైంది. తనకు ఎంబీబీఎస్ లో సీటు రాదని ఆవేదన చెందాడు. ‘అమ్మ, నాన్న నన్ను క్షమించండి .. నాకు ఎంబీబీఎస్ సీటు రాదు. అందుకనే ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.