Tuesday, August 18, 2026
HomeTelanganaపిల్లల ఎదుగుదలపై ప్రత్యేక పర్యవేక్షణ.?

పిల్లల ఎదుగుదలపై ప్రత్యేక పర్యవేక్షణ.?

📰 Generate e-Paper Clip


మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో పిల్లల ఎదుగుదలపై సంబంధిత అధికారుల సమన్వయంతో పర్యవేక్షణతో పాటు పోషకాహార లోప రహిత జిల్లాగా మంచిర్యాలను తీర్చిదిద్దడంలో అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమశాఖ, జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.

జిల్లాలో పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి వారి వివరాలు సేకరించి నివేదిక తయారు చేసి జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ, సంక్షేమశాఖల సమన్వయంతో గ్రామాలలో ఆశ, ఆరోగ్య కార్యకర్తల ద్వారా అవసరమైన పోషకాహార పంపిణీ, వైద్య సేవలు అందించాలని తెలిపారు. జిల్లాలో అతితీవ్ర పోషకాహార లోపం గల వారు 250 మంది, తక్కువ తీవ్ర పోషకాహర లోపంతో బాధపడుతున్న వారు 713 మంది పిల్లలు ఉన్నారని, వారు పోషకాహార లోపాన్ని అధిగమించే విధంగా అతి తీవ్రత గల వారికి రోజుకు 4 సార్లు, తక్కువ తీవ్రత గల వారికి 2 సార్లు బాలామృతం అందించాలని తెలిపారు. అంగన్వాడీ యూనిట్ గా ఆశా కార్యకర్తలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవాలని, పిల్లలకు సంబంధిత పూర్తి వివరాలతో నివేదిక తయారు చేసి ప్రతి నెల 5వ తేదీన వైద్యాధికారికి అందించాలని తెలిపారు. అవసరమైన వారికి వైద్యాధికారులు పరీక్షలను నిర్వహించి సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందించాలని, పోషకాహార లోపం గల వారిని జాతీయ పోషకాహార పునరావాస కేంద్రానికి పంపించాలని తెలిపారు. ఈ కేంద్రాలలో చిన్నపిల్లల వైద్యుల ద్వారా చికిత్స, పౌష్టికాహారం అందించడం జరుగుతుందని తెలిపారు. అతి తీవ్రతతో బాధపడుతున్న పిల్లలను 16 వారాలలో, తక్కువ తీవ్రత గల వారిని 8 వారాలలో సాధారణ స్థాయికి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు వారికి కేటాయించిన గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ పోషకాహార లోపం గల పిల్లలను గుర్తించాలని, కుటుంబంలోని సభ్యులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఆర్.బి.ఎస్.కె. 102 అంబులెన్స్లను ఈ కార్యక్రమానికి వినియోగించాలని తెలిపారు. ఎక్కువ కేసులు నమోదు అవుతున్న ప్రాంతాలను గుర్తించి, ఇందుకు గల కారణాలను తెలుసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించేలా సంబంధిత పంచాయతీ అధికారుల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తెలిపారు. జిల్లాను గ్రీన్ జోన్ లో నమోదు చేసేందుకు అధికారులు కృషి చేయాలని, కార్యక్రమ పర్యవేక్షణ కొరకు ప్రత్యేక అధికారిని నియమించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా॥ జి. సుబ్బారాయుడు, జిల్లా సంక్షేమశాఖ అధికారి చిన్నయ్య, ప్రోగ్రామ్ అధికారి డా॥ నీరజ, డా॥ అనిత, ఉప వైద్యాధికారి డా॥ విజయనిర్మల, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డా॥ అరవింద్, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, సి.డి.పి.ఓ.లు, సూపర్వైజర్లు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.