
కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దిల్లీ సీఎం కేజ్రివాల్
దిల్లీ: ఉచిత పథకాలపై భాజపాకు, ఆమాద్మీ పార్టీకి మధ్య వార్ మొదలైనట్లు కనిపిస్తోంది. కేంద్ర మంత్రులకు ఉచిత విద్యుత్ ఇస్తుండగా.. సామాన్య ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తే తప్పేంటని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. ఉచిత విద్య, వైద్యం అందిస్తామంటూ కేజ్రివాల్ చేసిన ప్రకటనపై భాజపా నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. భాజపా నేతల విమర్శలకు దీటుగా బదులిచ్చారు. ‘కేవలం మంత్రులు మాత్రమే ఉచిత విద్యుత్ పొందాలా..? సామాన్యులకు ఎందుకు ఇవ్వరు. ఉచితంగా నీరు, ఉచిత విద్య ఇవ్వడంలో తప్పేంటి..? అని అరవింద్ కేజ్రివాల్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న ఉచిత సేవలను కూడా ఉచిత పథకాలను చిత్రీకరించే ప్రయత్నం భాజపా చేస్తోందని విమర్శించారు. నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందించడంతోపాటు ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అరవింద్ కేజ్రివాల్ డిమాండ్ చేశారు. వీటితోపాటు నిరుద్యోగులకు భృతి కూడా అందించాలన్నారు..
ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల మిత్రులకోసం రూ.10లక్షల కోట్లను మాఫీ చేశారని ఆరోపించిన కేజీవాల్.. అప్పులు చెల్లించలేని వారిని ద్రోహులుగా ప్రకటించి, వారిపై దర్యాప్తు జరపాలి. అంతేకానీ, వారికి మద్దతు పలకడమేంటని అరవింద్ కేజీవాల్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా భాజపాను దోస్త్ వాద్, కాంగ్రెస్ పార్టీని పరివార్ వాద్ గా అభివర్ణించిన ఆయన.. ఒకపార్టీ తన మిత్రుల కోసం పనిచేస్తుండగా, మరోపార్టీ కుటుంబ పాలనలో మునిగిపోయిందని విమర్శించారు. తమ పార్టీ మాత్రం కేవలం భారతీయుల శ్రేయస్సు కోసమే పనిచేస్తుందని ఆమ్ ఆధ్మీ పార్టీ చీఫ్ ఉద్ఘాటించారు. ఉచిత పథకాల పేరుతో ఓటర్లను మభ్యపెట్టే వారిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రధాని మోదీ ఇటీవల పిలుపునిచ్చిన నేపథ్యంలో దిల్లీ సీఎం ఈ విధంగా స్పందించారు..
