
మంచిర్యాల జిల్లా: సినిమాను తలపించేలా సీన్స్ నిజజీవితలో జరుగుతే ఏలా ఉంటుందో అలాంటి ఘటననే ఇక్కడి ఫొటోలో కనిపిస్తున్న ఈ ప్రేమికుల జీవితంలో చోటుచేసుకుంది. ఓ వివాహితను తల్లిదండ్రులే కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ఘటన మంచిర్యాల జన్నారం మండలంలో కలకలం రేపింది. దీంతో పోలీసులు ఛేజ్ చేసి మరీ యువతిని రక్షించారు. వివరాల్లోకి వెళితే.. జన్నారం మండలం మొర్రిగూడకు చెందిన తోట నాగేష్, సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామకు చెందిన లక్ష్మిని ప్రేమించి శనివారం పెండ్లి చేసుకున్నాడు. అయితే ఈ వివాహం అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. దీంతో అబ్బాయి బంధువులపై వారం రోజుల కిందట దాడి చేసి కిడ్నాప్ కు ప్రయత్నించారు. విషయం పోలీసులకు చేరడంతో వారు కౌన్సెలింగ్ ఇచ్చారు. అమ్మాయి ఇష్టపడి పెండ్లి చేసుకుందని అమ్మాయిని తీసుకు వెళ్లడానికి ప్రయత్నించినా, ఇబ్బందులు పెట్టినా చర్యలు తీసుకుంటామని పోలీసులు, గ్రామ పెద్దలు హెచ్చరించడంతో అమ్మాయి తరఫు వాళ్లు వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో తిరిగి యువతి తల్లిదండ్రులు, బంధువులు వాహనాల్లో వచ్చి తోట నాగేష్ ఇంటిపై దాడికి దిగారు.
అమ్మాయిని కిడ్నాప్ చేసి వాహనాల్లో ఎక్కించుకుని తీసుకువెళ్లారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన ఎస్సె సతీష్ లక్ష్మిని కిడ్నాప్ చేసిన వాహనాలను వెంబడించి దండేపల్లి మండలంలోని ముత్యంపేట వద్ద పట్టుకున్నారు. ఈ మేరకు 23 మందిపై కేసు నమోదు చేసి మూడు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
