
ఆదిలాబాద్ జిల్లా: అందరినీ సమన్వయ పరుస్తూ వెళ్లాల్సిన ప్రిన్సిపాల్ అటు విద్యార్థుల పర్యవేక్షణ చూడాల్సిన వార్డెన్ ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నా ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. దాడి చేసుకొన్న ఇరువురు మహిళలు కావడం విశేషం. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని బంగారిగూడ లో గల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో నెలకొన్న ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది..
రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్ అతియా సుల్తాన మంగళవారం ఉదయం వార్డెన్ కైకష్ ను తన ఛాంబర్ కు పిలిచి పిల్లల అంశంపై వారించారు. పిల్లలకు అందించాల్సిన వాటిని సరిగా అందించడం లేదంటూ వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వార్డెన్ తాను పిల్లలకు అన్ని సరిగ్గానే అందిస్తున్నానని చెప్పడంతో ఇరువురూ ఒకరికొకరు వాగ్వాదానికి దిగారు. చివరకు తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుని ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరువురు స్వల్పంగా గాయపడ్డారు. కాగా పాఠశాల సిబ్బంది 108కి ఫోన్ చేసి, ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ దాడికి అసలు కారణమేంటి ఎందుకు ఒకరిపై ఒకరు ఇలా దాడి చేసుకున్నారనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
