హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి తన గత స్మృతులను గుర్తుకు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తాను మంత్రిగా ఉన్నప్పటికీ గతంలో చాలా కష్టాలు పడినట్లు వివరించారు. సైకిల్పై వీధివీధికీ తిరుగుతూ పాలు, పూలు విక్రయించినట్లు చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆదివారం నిర్వహించిన మే డే వేడుకలకు ఆయన హాజరై ప్రసంగించారు. కష్టపడితే సాధించలేనిదీ ఏదీ లేదంటూ వ్యాఖ్యానించారు. క్రమేపీ ఎదుగుతూ విద్యా సంస్థలను స్థాపించినట్లు చెప్పారు. తన కళాశాలలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందన్నారు. ఇంతలా ఎదగడానికి స్వయంకృషి కారణమని, రెక్కల కష్టంపై పైకి వచ్చానని చెప్పారు. కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. కార్మికుల పిల్లల కోసం గురుకులాలను సీఎం ఏర్పాటు చేశారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కార్మికులకు సంక్షేమ ఫలాలు అందక ఇబ్బంది పడేవారన్నారు.
మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తనకు కార్మికుల కష్టం తెలుసని, అందుకే కార్మికుల ధరించే వస్త్రాలను వేసుకుని వచ్చినట్లు వివరించారు. కరోనాతో ఇబ్బందులు ఎదురైనా ప్రస్తుతం తెలంగాణలో కార్మికులకు చేతి నిండి పని ఉందని చెప్పారు..