నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ లో సిబ్బందితో సమీక్ష
మరింత సిబ్బందిని నియమిస్తామని వెల్లడి
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్: షాద్‌నగర్ జాతీయ రహదారిపై ప్రమాదాలను అరికట్టడంతో పాటు పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ను సాధారణ తనిఖీల్లో భాగంగా ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా షాద్ నగర్ పోలీసు స్టేషన్లో స్టీఫెన్ రవీంద్ర శాఖాపరమైన సమీక్షలు నిర్వహించారు. శంషాబాద్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి, స్థానిక ఏసిపి కుశాల్కర్ తదితరులు కమిషనర్ వెంట ఉన్నారు. ఈ సందర్భంగా స్టీఫెన్ రవీంద్ర పోలీసు సిబ్బందితో మాట్లాడారు. స్థానిక పట్టణ సీఐ ఎస్ నవీన్ కుమార్, ఎస్సైలు వెంకటేశ్వర్లు, విజయ్ ఇంకా తదితర సిబ్బందితో ప్రత్యేకంగా మాట్లాడారు. విధి నిర్వహణ తీరుతో పాటు శాఖ పరమైన పరిపాలన అంశాలను అడిగి తెలుసుకున్నారు. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో అవసరమైన సిబ్బందిని త్వరలోనే నియమిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదే విధంగా ట్రాఫిక్ సమస్య తమ దృష్టికి వచ్చిందని, దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. శాంతిభద్రతలు ఎలా ఉన్నాయని స్టీఫెన్ రవీంద్ర మీడియాను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారిపై జరిగే రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేకంగా ఎస్సై ర్యాంక్ బృందాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ నియంత్రణ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదే విధంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ పోలీస్ స్టేషన్లో క్వార్టర్ల ఏర్పాటు నిర్మాణానికి పరిశీలిస్తామని తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు గురించి
సిఐ నవీన్ కుమార్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసు స్టేషన్లో రికార్డులను కమిషనర్ పరిశీలించారు.. ఈ సమావేశంలో డిసిపి జగదీశ్వర్ రెడ్డి, ఏసిపి కుశాల్కర్, సీఐ నవీన్ కుమార్ ఎస్సైలు వెంకటేశ్వర్లు, విజయ్ తదితరులు పాల్గొన్నారు..