కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఎంపికతో జాతీయ వేడుకల్లో జిల్లా ప్రతినిధులు
13 మంది ప్రత్యేక ఆహ్వానితులకు అరుదైన అవకాశం
మంచిర్యాల, నవంబర్ 2, (ఆంజనేయులు న్యూస్)
జాతీయ స్థాయి వేడుకల్లో మంచిర్యాల జిల్లా తన ప్రత్యేకతను చాటుకుంది. గుజరాత్‌లోని ఏక్తా నగర్లో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏక్తా దివస్ పరేడ్‌లో మంచిర్యాల జిల్లాకు చెందిన 13 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని జిల్లాకు గౌరవం తీసుకొచ్చారు. భారత తొలి హోంమంత్రి, ఉప ప్రధాని సర్దార్ వల్లభభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 31న నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుంచి 400 మంది ప్రత్యేక ఆహ్వానితులకు ఆహ్వానం అందగా, మంచిర్యాల జిల్లా నుంచి 13 మందికి అవకాశం లభించింది. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఎంపికతో రైతులు, వ్యాపారవేత్తలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులకు ఈ బృందంలో చోటు కల్పించారు. మొత్తం 13 మందిలో ఐదుగురు పెద్దలు, ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు. వివిధ వర్గాలకు చెందిన వారికి జాతీయ స్థాయి వేడుకల్లో భాగస్వాములయ్యే అవకాశం లభించడం విశేషంగా నిలిచింది. విద్యార్థుల్లో ఇద్దరు డిగ్రీ చదువుతుండగా, నలుగురు పదో తరగతి, ఇద్దరు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. వీరిలో ఐదుగురు బాలికలు, ముగ్గురు బాలురు ఉన్నారు. చిన్న వయసులోనే దేశ అత్యున్నత స్థాయి జాతీయ వేడుకల్లో పాల్గొనే అవకాశం రావడం విద్యార్థులకు మరపురాని అనుభూతిగా నిలిచింది. నక్సల్ ముక్త్ భారత్, నశా ముక్త్ భారత్ లక్ష్యాల నేపథ్యంలో నిర్వహించిన ఏక్తా దివస్ పరేడ్‌లో మంచిర్యాల బృందం పాల్గొంది. కలెక్టరేట్ పరిపాలన అధికారి, జిల్లా నోడల్ అధికారి దేశ్‌పాండే శ్రీనివాసరావు నేతృత్వంలో ఈ బృందం గుజరాత్‌కు వెళ్లింది. పరేడ్‌కు ముందు ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహమైన సర్దార్ వల్లభభాయ్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఏక్తా పరేడ్‌లో భాగస్వాములయ్యారు. ఈ ఏక్తా యాత్ర ద్వారా తాము ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నామని విద్యార్థులు తెలిపారు. దేశ ఐక్యత, సమగ్రత, జాతీయ భావం, సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఆశయాల గురించి తెలుసుకునే గొప్ప అవకాశం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ యాత్రలో పొందిన అనుభవాలు తమ భవిష్యత్తుకు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. జాతీయ స్థాయి కార్యక్రమంలో పాల్గొనడం తమకు ఎంతో సంతోషాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని విద్యార్థులు తెలిపారు. కలెక్టర్, డీసీపీకి కృతజ్ఞతలు..! ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న జాతీయ స్థాయి కార్యక్రమంలో భాగస్వాములయ్యే అరుదైన అవకాశం కల్పించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎగ్గడి భాస్కర్లకు బృంద సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్ ప్రయాణం, వసతి తదితర ఏర్పాట్లను ఎంతో చక్కగా నిర్వహించారని పేర్కొన్నారు. తమ వెంట ఉండి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా నోడల్ అధికారి దేశ్‌పాండే శ్రీనివాసరావుకు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. జాతీయ స్థాయి వేదికపై మంచిర్యాల జిల్లా ప్రతినిధులుగా పాల్గొనడం తమకు ఎంతో గర్వకారణమని బృంద సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ అరుదైన జాతీయ స్థాయి వేడుకల్లో మంచిర్యాల జిల్లా ప్రతినిధులు పాల్గొని జిల్లాకు గుర్తింపు తీసుకురావడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బృంద సభ్యులను అభినందిస్తూ, మంచిర్యాల జిల్లాకు గర్వకారణంగా నిలిచారని జిల్లా వాసులు ప్రశంసిస్తున్నారు.
