మంచిర్యాలలో ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలోమహిళలు, చిన్నారుల రక్షణపై ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమం
మంచిర్యాల, అక్టోబర్ 27, ( ఆంజనేయులు న్యూస్ )
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో, షీ టీమ్స్ సహకారంతో పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులకు ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ వ్యవస్థ పనితీరు, పోలీసుల విధులు, బాధ్యతలు, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల రక్షణకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను వివరించారు. గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పిస్తూ, ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినప్పుడు భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. విద్యార్థులు తమకు ఎదురయ్యే సమస్యలను దాచుకోకుండా పెద్దలతో పంచుకోవాలని, మహిళలు, చిన్నారుల భద్రతకు పోలీస్ శాఖ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అదేవిధంగా పోలీస్ శాఖలో వినియోగించే కమ్యూనికేషన్ పరికరాలు, నేరాల దర్యాప్తులో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక పోలీసింగ్ విధానాలను స్టేషన్ సిబ్బంది విద్యార్థులకు వివరించారు. పోలీసుల విధులు, బాధ్యతలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పించడంతో పాటు, ప్రజలకు పోలీస్ శాఖ అందిస్తున్న సేవలపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఎస్‌ఐ ఉషారాణి, మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది, షీ టీమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.
