స్థానిక కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం!
మంచిర్యాల అక్టోబర్ 27, ( ఆంజనేయులు న్యూస్ )
మంచిర్యాల పట్టణంలోని 41వ డివిజన్ కాలేజీ రోడ్ ఎడ్లవాడ ప్రాంతంలో పందుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొదట్లో ఒకటి, రెండు పందులు మాత్రమే ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య గణనీయంగా పెరిగిందని కాలనీవాసులు చెబుతున్నారు. వీధుల్లో పందుల సంచారం పెరగడంతో పరిసరాల పరిశుభ్రత దెబ్బతింటోందని, దోమల సమస్యతో పాటు ప్రజారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను గతంలోనే 41వ డివిజన్ కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను తెలియజేసినా పరిష్కారం చూపకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికే వాతావరణ మార్పుల కారణంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు, పందుల బెడద మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా 41వ డివిజన్ కార్పొరేటర్‌తో పాటు మున్సిపల్ అధికారులు స్పందించి, కాలనీలో పందుల సంచారాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పందుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపి, కాలనీని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజారోగ్యాన్ని కాపాడాలని కాలనీవాసులు కోరుతున్నారు.
