Sunday, September 13, 2026
HomeTelanganaప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ ప్రారంభం

ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ ప్రారంభం

📰 Generate e-Paper Clip

హెపటైటిస్‌పై అప్రమత్తతే రక్షణ: డీఎంహెచ్‌వో డా. నరేందర్ రాథోడ్

మంచిర్యాల, జూలై 28, ( ఆంజనేయులు న్యూస్ )

ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. నరేందర్ రాథోడ్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెపటైటిస్ వైరస్‌లు (A, B, C, D, E) కారణంగా కాలేయ వ్యాధులు వస్తాయని తెలిపారు. కలుషిత రక్తం, వాడిన సూదులు, తల్లి నుంచి బిడ్డకు, కలుషిత ఆహారం, తాగునీటి ద్వారా ఈ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందన్నారు. హెపటైటిస్ ఒక మౌనవ్యాధి అని, ప్రారంభంలో లక్షణాలు కనిపించకపోయినా కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరించారు. మత్తు పదార్థాల వినియోగం, మద్యపానం, అనారోగ్యకర జీవనశైలి, వ్యక్తిగత పరిశుభ్రత లోపం వంటి కారణాలతో కాలేయ వ్యాధుల ముప్పు పెరుగుతుందని తెలిపారు. ప్రతి శస్త్రచికిత్సకు ముందు రక్త పరీక్షలు నిర్వహించడం, డిస్పోజబుల్ సిరంజీలను మాత్రమే వినియోగించడం, హెపటైటిస్-బి టీకాలు వేయించుకోవడం, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధిని నివారించవచ్చని సూచించారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, మాతా-శిశు సంరక్షణ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకుల్లో హెపటైటిస్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి హెపటైటిస్-బి టీకాలు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలంతా హెపటైటిస్‌పై అవగాహన పెంచుకుని, పరీక్షలు చేయించుకుని ఆరోగ్యవంతమైన జీవనం గడపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సంచాలకులు డా. అశోక్, డా. శ్రీధర్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. సుధాకర్ నాయక్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, వైరల్ హెపటైటిస్ జిల్లా కోఆర్డినేటర్ మధు, సీహెచ్‌వోలు పుట్ట సత్తయ్య, కాకిరాల వెంకటేశ్వర్లు, నాందేవ్, సబ్ యూనిట్ అధికారి శ్రీనివాస్, వైద్యులు డా. అమన్, డా. రమ్య, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.