చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్
మంచిర్యాల, జూలై 28, ( ఆంజనేయులు న్యూస్ )
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత నాలుగు దశాబ్దాలుగా బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమాలు కొనసాగుతున్నప్పటికీ, కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దీనిపై నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయని విమర్శించారు. పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న 36 రాజకీయ పార్టీల్లో 32 పార్టీలు బిల్లుకు మద్దతు ప్రకటించాయని, అలాగే 11 రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించినప్పటికీ బిల్లును ప్రవేశపెట్టకపోవడం బీసీ సమాజాన్ని నిరాశకు గురిచేస్తోందన్నారు. దేశ జనాభాలో 10 శాతం కూడా లేని అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10 శాతం రిజర్వేషన్ కల్పించిన కేంద్ర ప్రభుత్వం, బీసీల న్యాయమైన రాజకీయ రిజర్వేషన్ల డిమాండ్‌ను విస్మరించడం వివక్షకు నిదర్శనమని ఆరోపించారు. దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం నెలకొనాలంటే జనాభా నిష్పత్తికి అనుగుణంగా అన్ని వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, శాకపూర్ భీమ్సేన్, వేముల అశోక్, చంద్రగిరి చంద్రమౌళి, అంకం సతీష్, గగ్గూరి రాజన్న, మహమ్మద్ లతీఫ్, సీనియర్ న్యాయవాది కర్రే లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
