Sunday, August 23, 2026
HomeTelanganaఫోటోలకే పరిమితమైన డ్రైనేజీ పనులు.. గ్రీన్ సిటీ వాసుల ఆగ్రహం

ఫోటోలకే పరిమితమైన డ్రైనేజీ పనులు.. గ్రీన్ సిటీ వాసుల ఆగ్రహం

📰 Generate e-Paper Clip

• ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం.. గ్రీన్ సిటీలో డ్రైనేజీ సమస్య యథాతథం

• 15 రోజులుగా “రేపు వస్తాం” అంటూ కాలయాపన

• మున్సిపల్ అధికారులతో పాటు కార్పొరేటర్‌పైనా ప్రజల మండిపాటు

( మంచిర్యాల, జులై 7, ఆంజనేయులు న్యూస్ )

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గ్రీన్ సిటీ కాలనీలో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు మరోసారి మున్సిపల్ అధికారులను, స్థానిక కార్పొరేటర్‌ను డిమాండ్ చేస్తున్నారు. గతంలో సమస్యపై వార్తలు రావడంతో స్పందించిన మున్సిపల్ అధికారులు కాలనీకి వచ్చి కొంతమేర పనులు చేసినట్లు చూపించి, ఫోటోలు తీసుకుని వెళ్లిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే అసలు డ్రైనేజీ సమస్యను పూర్తిగా పరిష్కరించకుండా అలాగే వదిలివెళ్లడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసినప్పటికీ “రేపు వస్తాం.. చేస్తాం” అనే హామీలే తప్ప, గత 15 రోజులుగా ఎవరూ వచ్చి పనులు చేపట్టలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ మురుగునీరు రోడ్లపై నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని, దోమలు విపరీతంగా పెరిగి ఇళ్లలోకి చేరుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారి డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, గ్రీన్ సిటీ కార్పొరేటర్ కూడా కాలనీలో నెలకొన్న ఈ ప్రధాన సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ప్రజల ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులతో సమన్వయం చేసి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి చొరవ చూపలేదని విమర్శిస్తున్నారు. “పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నాం.. కనీస సౌకర్యాలు కూడా కల్పించలేరా? ఈ పరిస్థితుల్లో ప్రజలకు వ్యాధులు వస్తే బాధ్యత ఎవరు వహిస్తారు?” అంటూ కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, స్థానిక కార్పొరేటర్ వెంటనే స్పందించి గ్రీన్ సిటీ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, లేకపోతే ప్రజలంతా కలిసి ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.