Monday, August 17, 2026
HomeTelanganaఆత్మ పథకంపై రైతులకు అవగాహన కరువు

ఆత్మ పథకంపై రైతులకు అవగాహన కరువు

📰 Generate e-Paper Clip

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల నామమాత్రపు సదస్సులు

ఉన్నతాధికారులు స్పందించాలంటున్న రైతులు

 

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: వ్యవసాయ రంగంలో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు.. రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి.. వారిని చైతన్య వంతులను చేయాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) పథకం నిర్వీర్యమవుతోంది. ఆత్మ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ రైతులను చైతన్యవంతం చేసేందుకు సదస్సులు, ప్రదర్శనలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ అవి ఎక్కడా మచ్చుకైనా కానరావడం లేదు. యంత్రాలు కొనుగోలు చేసినప్పటికీ వాటిపై అవగాహన కల్పించే వారే కరువయ్యారు. ఇవన్నీ ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉన్నా.. అడుగు ముందుకు పడడం లేదు. తూతూ మంత్రంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు తప్పా సదస్సులు అసలే నిర్వహించడం లేదు. దీంతో ఆత్మపథకం ఆవిరైపోతున్నట్టు కనిపిస్తోంది. వరి, పత్తి, సోయా, కందులు, పెసర, శనగ తదితర పంటలతో పాటు మామిడి, జామ, దానిమ్మ తోటలను పెంచుతున్న రైతులకు సాగుపై సూచనలు, సలహాలు ఇవ్వాలి. ఏటా ఈ పథకం లక్ష్యం నిర్దేశించుకున్నా ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేక వాటి గురించి మర్చిపోవాల్సి వస్తోంది

• ఆత్మ ద్వారా ఇలా..

ఆత్మ పథకాన్ని 2014లో ప్రవేశపెట్టారు. అందుకు ప్రత్యేకమైన కమిటీలు ఏర్పాటు చేశారు. జిల్లా కమిటీలో కలెక్టర్‌ చైర్మన్‌ గా, జిల్లా వ్యవసాయ అధికారి కన్వీనర్‌గా ఉంటారు. గతంలో డివిజన్‌ స్థాయిలో ఈ కమిటీలు ఏర్పాటు చేశారు. అధికారులు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి యంత్రాలతో ప్రదర్శనలు నిర్వహించి రైతులకు సాంకేతికతపై అవగాహన కల్పించాలి. సమగ్ర వ్యవసాయ సహకారిగా తోడ్పడే పశు సంవర్ధక శాఖ, ఉద్యానవన శాఖ, చేపల పెంపకం వంటి శాఖల్లో సాంకేతికంగా వచ్చే అనేక మార్పులకు సంబంధించిన అంశాలు అధికారులు వివరించాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం ఏటా లక్షలాది రూపాయల నిధులు విడుదల చేస్తుంది.

• అన్నదాతలకు అవగాహన కరువు..

వ్యవసాయ రంగం అభివృద్ధి సాధించాలంటే రైతులు అధునాతన విజ్ఞానం కలిగి ఉండాలి. అందుకు ఆధునిక యంత్రాలను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలి. కానీ వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యంతో ఆత్మపథకం ఉందన్న విషయమే ఉమ్మడి జిల్లాలోని చాలా మండలాల రైతులకు తెలియకుండా పోతోంది. గ్రామగ్రామాన తిరిగి రైతులకు సాంకేతికతపై అనేక విషయాలపై తెలియజేయాల్సిన అధికారులు ఎక్కడో ఓ సారి ఏదో ఓ గ్రామంలో పది మంది రైతులను కుర్చోబెట్టి సదస్సులు నిర్వహించి చేతులు దులుపుకొంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.

• ఉమ్మడి జిల్లాలో అవగాహనలేని రైతులు

అసలు ఆత్మ అంటే ఏమిటి? దాని కార్యాలయం ఎక్కడ ఉంది? దానిలో ఎంతమంది పనిచేస్తారు? వారి ద్వారా రైతు లకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? అనేదానిపై ఉమ్మడి జిల్లాలో చాలా మంది రైతులకు ఇప్పటి వరకు అవగాహన లేకపోవడం గమనార్హం. ఆత్మ కమిటీకి ఏడాది పొడవునా నిధులు వచ్చినా వాటి వినియోగం ఉండదు. కొన్నిచోట్ల తమకు అనుకూలంగా ఉన్న పదిమంది రైతులను తీసుకు వచ్చి అవగాహన కల్పిస్తున్నామని ఫొటోలు తీయించి మమ అనిపించేస్తూ ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు దిగమింగుతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఆత్మ ఆధ్వర్యంలో మండలస్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా శిక్షణ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పథకం ఉద్దేశాన్ని సదస్సుల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించి అవగాహన కల్పించాలని జిల్లా రైతులు కోరుతున్నారు.

అవగాహన సదస్సులు నిర్వహిస్తాం:

– సింగతి మురళి, ఆత్మ కమిటీ చైర్మన్‌, మంచిర్యాల నియోజకవర్గం

ఆత్మలో సిబ్బంది కొరత ఉంది. అయినప్పటికీ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో వ్యవసాయశాఖ సిబ్బందితో కలిసి రైతులకు సమగ్ర వ్యవసాయ సహకారిగా తోడ్పడే పశు సంవర్ధక శాఖ, ఉద్యానవన శాఖ, చేపల పెంపకం వంటి శాఖల్లో సాంకేతికంగా వచ్చే అనేక మార్పులకు సంబంధించిన అంశాలు అవగాహన కల్పిస్తున్నాం. ఆత్మ ద్వారా ఏ పంటలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామనే విషయాన్ని రైతులకు తెలియజేస్తున్నాం. ఉద్యానవన, ఇతర శాఖలను సమన్వయ పరిచి మునుముందు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.