తహసిల్దార్ ఇమ్రాన్ ఖాన్ చొరవకు వందనం
30 గుంటల భూమి కూస కిష్టయ్య కుటుంబానికి రిజిస్ట్రేషన్
కిష్టయ్య కుటుంబానికి రిజిస్ట్రేషన్ పట్టా పాస్ బుక్ అందజేస్తున్న తాండూర్ ఎమ్మార్వో ఇమ్రాన్
ఆంజనేయులు న్యూస్, తాండూర్: చిరకాలంగా సాగుతున్న భూవివాదానికి మంచిర్యాల జిల్లా తాండూరు మండలం తహసిల్దార్ ఇమ్రాన్ ఖాన్ చొరవతో శాశ్వత పరిష్కారం లభించింది. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు ప్రజావాణిలో అందిన ఫిర్యాదును దృష్టిలోకి తీసుకొని, సోమవారం అచలాపూర్ గ్రామంలో అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించారు. సర్వే నంబరు 820లోని 30 గుంటల వ్యవసాయ భూమిని పరిశీలించగా, పొట్లపల్లి బానయ్య తండ్రి చిన్న రామయ్య 1991లో తన భూమిని కూస కిష్టయ్య తండ్రి రాజయ్యకు రిజిస్ట్రేషన్ ద్వారా విక్రయించినట్లు రికార్డులు వెల్లడించాయి. అప్పటి నుంచే కూస కిష్టయ్య ఆ భూమిని సాగు చేసుకుంటున్నప్పటికీ, మోటేషన్ నమోదు చేయకపోవడంతో పట్టా తమ పేరుపై లేని పరిస్థితి కొనసాగింది. ఇకపోతే బానయ్య మరణంతో ఆయన భార్య భీమక్కకు విరాసత్ పట్టా జారీ కాగా, భవిష్యత్తులో ఆమె తన కుమారుడు పొట్లపల్లి మహేష్ కు భూమిని సెల్ డీడ్ ద్వారా బదలాయించారు. ఇలా భూమిపై యాజమాన్య హక్కు పట్ల అనిశ్చితి నెలకొంది.

ఈ నేపథ్యంలో తహసిల్దార్ ఇమ్రాన్ ఖాన్ చొరవ తీసుకొని రెండు కుటుంబాలను కలిపి చట్టపరమైన స్పష్టత ఇచ్చారు. కూస కిష్టయ్య పేరుపై భూమి రిజిస్ట్రేషన్ చేయబడింది. వెంటనే ఆన్లైన్ పట్టా పాస్ బుక్ ను కూడా జారీ చేసి బాధిత కుటుంబానికి అందజేశారు. తహసిల్దార్ చొరవతో సమస్యను శాంతియుతంగా పరిష్కరించడంతో రెండు కుటుంబాల సభ్యులు కలెక్టర్ కుమార్ దీపక్, తహసిల్దార్ ఇమ్రాన్ ఖాన్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. భూవివాదాలపై అధికారుల వేగవంతమైన స్పందన పట్ల స్థానికుల మధ్య హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
