Tuesday, August 18, 2026
HomeCrimeసార్.. ఈ అన్నం మీరు తింటారా..?

సార్.. ఈ అన్నం మీరు తింటారా..?

📰 Generate e-Paper Clip

ఉస్మానియా వసతి గృహాల్లో నాసిరకం భోజనం

విద్యార్థుల ఆరోగ్యంతో అధికారుల చెలగాటం

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: నారాయణగూడ ఉస్మానియా విశ్వవిద్యాలయం వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల ఆరోగ్యాలతో అధికారులు చెలగాటమాడుతున్నారు. మధ్యాహ్నం, రాత్రి విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారంలో పురుగులు వస్తున్నా పట్టింపే లేనట్లు వ్యవహరిస్తున్నారు. నిజాం కళాశాల వసతి గృహంలో నాలుగురోజుల క్రితం భోజనం తినేందుకు వచ్చిన విద్యార్థులు అన్నం, కూరల్లో పురుగులను గుర్తించారు. గుడ్డుకూరలో ప్లాస్టిక్ దారాలు వెలికి తీశారు. విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తే.. “ఆహారంలో పురుగులు మీరే వేసుంటారేమో”నని వార్డెన్ వెటకారంగా మాట్లాడారని విద్యార్థులు వాపోయారు. నిజాం కళాశాలతో పాటు ఉస్మానియా క్యాంపస్, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, సైఫాబాద్, సికింద్రాబాద్ పీజీ కళాశాలల వసతి గృహాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ప్రభుత్వ నుంచి సకాలంలో నిధులు రాకపోవడం వల్లే వసతి గృహాలను నిర్వహించలేకపోతున్నామని అధికారులు పేర్కొంటున్నారు.

• అనారోగ్య సమస్యలు.

ఉన్నత చదువులు చదివేందుకు నగరానికి వచ్చిన డిగ్రీ, పీజీ విద్యార్థులు ఓయూ వర్సిటీ పరిధిలోని కళాశాలల వసతి గృహాల్లో వడ్డిస్తున్న ఆహారం సరిగా లేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. అనారోగ్యంతో అవస్థలు పడుతున్నారు. విద్యార్థినులైతే వారంలో ఒకసారైనా వైద్యులను సంప్రదించాల్సిన పరిస్థితులున్నాయి. వసతిగృహాలు నిర్వహిస్తున్న అధికారులు బియ్యం, కూరగాయలు, ఇతర సరకులు సరఫరా చేసే గుత్తేదారులకు ఆలస్యంగా బిల్లులు చెల్లిస్తుండటంతో దొడ్డు అన్నం, కూర, సాంబార్ మాత్రమే ఇస్తున్నారు. ఆదివారం చిన్నకప్పు కోడికూర ఇస్తున్నారు. సరఫరాదారులకు డబ్బులిచ్చేందుకు బడ్జెట్ లేకపోవడం, విద్యార్థుల నుంచి మెస్ బిల్లులు వసూలులో ఇబ్బందులతోనూ వంటవారికి డబ్బులిచ్చేందుకు కష్టాలు ఎదుర్కొంటున్నారు.

గుడ్డు కూరలో వచ్చిన రబ్బరు బ్యాండ్

• బయట తినే ఆర్థిక స్తోమత లేక..

భోజనం నాణ్యంగా లేకపోయినా విద్యార్థులు సర్దుకుపోతున్నారు. అన్నం, సాంబార్ లో బొద్దింకలు, పురుగులు వచ్చినప్పుడు ఆందోళనలు చేస్తున్నారు. బయట తినేందుకు వెళితే ఒకపూటకే రూ.100నుంచి 200 వరకూ ఖర్చవుతుందన్న ఉద్దేశంతో ఆర్థిక స్తోమత లేక పప్పులేని నీళ్ల సాంబార్తోనే సర్దుకుపోతున్న పరిస్థితి.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని విద్యార్థినుల వసతి గృహంలో 900మంది విద్యార్థినులకు ఒకే ఆహారశాల ఉంది. నాలుగు అంతస్తులున్న వసతిగృహంలో విద్యార్థినులు మధ్యాహ్నం, రాత్రి భోజనం తినేందుకు కిందకు రావాలి.

నిజాం కళాశాల వసతి గృహంలో అల్పాహారంగా పూరీ, మైసూర్ బజ్జీ చేసినప్పుడు వాటిల్లోని నూనెను చూసి భయపడి కొందరు తినడం మానేస్తున్నారు.

మహిళా విశ్వవిద్యాలయంలో అన్నం, సాంబార్ సరిగా లేదని ఫిర్యాదు చేస్తే.. తమనే లక్ష్యంగా చేసుకుంటారన్న భావనతో పలువురు తినీతినక రోజులు గడిపేస్తున్న పరిస్థితి నెలకొంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.