పేదలకు కేసీఆర్ బీమా?
90 లక్షల కుటుంబాలకు రైతు బీమా మాదిరి వర్తింపు
సాగుపెట్టుబడి సాయమూ పెంపు
వంట గ్యాస్ సిలిండర్ కు భారీ సబ్సిడీ
భారాస మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలివి!
నేటి మధ్యాహ్నం 12.15 గంటలకు విడుదల చేయనున్న కేసీఆర్
119 మంది పార్టీ అభ్యర్థులకూ బీఫాంల అందజేత
సాయంత్రం హుస్నాబాద్ బహిరంగ సభతో ఎన్నికల ప్రచారబేరీ

ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: రైతు బీమా మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా పేద కుటుంబాలకు వర్తించేలా ముఖ్యమంత్రి పేరిట కేసీఆర్ బీమా పథకం.. నిరుపేద మహిళలకు నెలనెలా రూ. 3,000 సాయం.. ఆసరా పింఛన్ల మొత్తం పెంపు… వంట గ్యాస్ సబ్సిడీ.. రైతు బంధుసాయం పెంపు.. ఎకరానికి రెండు బస్తాల ఉచిత యూరియా వంటి పథకాలతో భారత్ రాష్ట్ర సమితి 2023 ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించినట్లు తెలిసింది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పేదలు, రైతులు, మహిళకు ప్రాధాన్యం కల్పించేలా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిని తీర్చిదిద్దినట్లు సమాచారం. 2014లో మ్యానిఫెస్టోను ముందుగానే విడుదల చేసిన పార్టీ… 2018లో మాత్రం ఎన్నికలకు మూడురోజుల ముందే విడుదల చేసింది. తాజాగా 45 రోజుల ముందు విడుదల చేస్తోంది. దాదాపు నెలరోజుల పాటు సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోపై విస్తృత కసరత్తు చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నిపుణులు, ఆర్థిక, సామాజికవేత్తల అభిప్రాయాలతో పాటు వివిధ వర్గాల ప్రజల మనోభావాలు తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాలు, వేరే పార్టీల ఎన్నికల హామీలు, అమలు తీరుతెన్నులను సైతం పరిశీలించారు. అన్ని వర్గాలకు వర్తించేలా.. ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలను మరింత పెంచడంతోపాటు కొత్తగా మరికొన్ని మ్యానిఫెస్టోలో ప్రకటించబోతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
• ముఖ్యమైన హామీలు ఇలా..
• ప్రస్తుతం రైతుబీమా పథకం కింద రైతు ఏదేని కారణం వల్ల చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా సాయాన్ని అందజేస్తున్నారు. దీనిని రాష్ట్రంలోని 90 లక్షల పేద కుటుంబాలకు వర్తింపజేస్తారు. కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సాయం అందుతుంది.
• రాష్ట్రంలోని నిరుపేద మహిళలకు జీవన భృతిగా నెలనెలా రూ.3,000 సాయం అందజేత. ప్రస్తుతం 57 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ వస్తుండగా… పెన్షనర్లు గాక మిగిలిన మహిళలకు ఇది వర్తిస్తుంది.
• ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, టేకేదార్లు, నేత, గీతకార్మికులు, కళాకారులు, బోదకాలు, డయాలసిస్, హెచ్ఐవీ బాధితులకు నెలకు రూ.2,016 చొప్పున ప్రభుత్వం పింఛన్ ఇస్తోంది. దీనిని రూ.3,016కి పెంచుతామని హామీ.
• దేశంలో తొలిసారిగా రైతులకు పెన్షన్ను మ్యానిఫెస్టోలో చేర్చనున్నారు. 57 ఏళ్లు దాటి, రెండు ఎకరాల్లోపు వ్యవసాయభూమి గల వారిని అర్హులుగా ప్రకటించి పెన్షన్ ఇస్తామని పార్టీ హామీ ఇవ్వనుంది. జర్నలిస్టులకూ పెన్షన్ పథకం తెస్తామని పేర్కొననుంది.
• రైతుబంధు కింద ప్రస్తుతం రెండు సీజన్లకు కలిపి పెట్టుబడిసాయం కింద ఎకరాకు రూ. పదివేల సాయాన్ని ప్రభుత్వం ఇస్తోంది. దానిని రూ. 16 వేలకు పెంపు.
• రైతులకు పెట్టుబడి సాయంతో పాటు ప్రతి సీజన్ లో ఎకరానికి రెండేసి బస్తాల యూరియాను ఉచితంగా సరఫరా చేస్తామని హామీ.
• కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లి ఖర్చులకు ప్రభుత్వం రూ.1,00,116 చొప్పున అందిస్తున్న ఆర్థిక సాయం రూ.1.25 లక్షలకు పెంపు.
• వంట గ్యాస్ సిలిండర్లకు కేంద్రం ఇచ్చే సబ్సిడీగాక రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.400 మేరకు ఇస్తామని హామీ.
• కేసీఆర్ కిట్ కు ప్రస్తుతం ఇస్తున్న నగదు సాయాన్ని రూ.12 వేల నుంచి రూ.15 వేలకు పెంపు.
• మహిళలు, యువతకు రూ. రెండు లక్షల మేర వడ్డీలేని రుణాలు.
• సీనియర్ సిటిజన్లకు భరోసా పథకం.
• ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్స పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు.
• పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర పన్ను వాటా కొంత
• ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల మాదిరే బీసీ విద్యార్థులకూ పూర్తిస్థాయి బోధన రుసుం చెల్లింపు . ఇవిగాక దళితబంధు, గిరిజన, బీసీ, మైనారిటీ బంధు, గృహలక్ష్మి పథకాలను మరింత సమర్థంగా అమలు చేయడం, ఎక్కువ మందికి ఆర్థిక సాయం చేసేందుకు బడ్జెట్ కేటాయింపులు పెంచడం వంటి హామీలు ప్రణాళికలో ఉండబోతున్నాయి. మహిళా సాధికారత కోసం కొత్త పథకాలను ప్రకటించే వీలుంది. యువతకు స్వయం ఉపాధి పథకాలు, నైపుణ్య శిక్షణ, ఉద్యోగాల భర్తీకి ఏటా క్యాలెండర్ విడుదల తదితర అంశాలు సైతం ఇందులో చోటు చేసుకోనున్నాయి. ఇవిగాక మరో 30కి పైగా హామీలను కూడా ఎన్నికల ప్రణాళికలో చేర్చారు.
