
ఈ వీడియోను ముఖ్యమంత్రికి ట్యాగ్ చేయాలని ఆలోచిస్తున్నాను.
ఆంజనేయులు న్యూస్: విధి విచిత్రమైంది. జీవిత ప్రయాణంలో అనూహ్య పరిణామాలను మనకు అనుభవంలోకి తెస్తుంటుంది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో చూస్తుంటే అదే నిజమనిస్తోంది. మామూలుగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తేన్న వ్యక్తికి తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఆ ఘటనతో ఆ వ్యక్తికి నోటమాట రాలేదు. ఇంతకీ విషయం ఏంటంటే…
ఆ వీడియోలో ఓ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్నారు. పని నిమిత్తం పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లేందుకు రోడ్డుకు, షాప్ కు మధ్య సైడ్వాక్(ఫుట్పాత్ మాదిరి పై కాలు వేశారు. ఇలా రెండు అడుగులు వేశారో లేదో.. షాప్ ఎదురుగా ఉన్న ఆ సైడ్వాక్ ఒక్కపెట్టున కిందనున్న డ్రైనేజీలోకి కూలిపోయింది. ఒక్క సెకను ఆలస్యం అయినా.. సదరు వ్యక్తి కూడా అందులో పడిపోయేవారే. తృటిలో పెనుప్రమాదం తప్పించుకున్న అతడికి కాసేపు నోటమాట రాలేదు. ఈ వీడియో ఆనంద్ మహీంద్రా దృష్టికి చేరింది. ‘ఈ విశ్వం ఆ వ్యక్తికి ఏ సందేశం పంపాలనుకుంది..? ఆ విషయాన్ని అర్థం చేసుకునేందుకు ఈ వారాంతాన్ని కేటాయించాలనుకుంటున్నాను. అదే స్థానంలో మీరుంటే ఏం ఆలోచిస్తారు..?’ అంటూ మహీంద్రా విచారం వ్యక్తం చేశారు. కొందరు నెటిజన్లు ఈ ఘటనను తీవ్రంగా తీసుకున్నారు..
‘ఈ వీడియోను ముఖ్యమంత్రికి ట్యాగ్ చేయాలని ఆలోచిస్తున్నాను. అతనికి ఏదైనా జరిగి ఉంటే.. ప్రభుత్వం ఏంచేసేది..? అంటూ ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు మాత్రం లేవు.
