మంచిర్యాల సెప్టెంబర్ 19, ( ఆంజనేయులు న్యూస్ )
మంచిర్యాల పట్టణంలోని అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో మంచిర్యాల ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎం.డి. హన్నన్ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ ఎం.డి. హన్నన్ మాట్లాడుతూ.. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలని, నిర్ణీత వేగ పరిమితిలోనే వాహనాలు నడపాలని సూచించారు. వాహనం నడుపుతున్న సమయంలో సెల్‌ఫోన్ వినియోగించకూడదని తెలిపారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల కారణంగా రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, వాటి ప్రభావం కుటుంబాలపై తీవ్రంగా ఉంటుందని విద్యార్థులకు వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజంలోని ఇతరులకు కూడా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా యువత వాహనాలు నడిపేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, తమ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలని సీఐ హన్నన్ సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు భద్రతకు తమ వంతు సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. చిన్న వయస్సు నుంచే విద్యార్థుల్లో ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
