Wednesday, August 5, 2026
HomeTelanganaసంకల్పం'తో నవజాత శిశు మరణాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు

సంకల్పం’తో నవజాత శిశు మరణాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు

📰 Generate e-Paper Clip

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్యులతో డీఎంహెచ్‌వో డాక్టర్ నరేందర్ రాథోడ్ సమీక్ష

100% గర్భిణుల నమోదు పూర్తి – హైరిస్క్ గర్భిణుల ప్రత్యేక పర్యవేక్షణ

అన్ని ఆసుపత్రులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశం

మంచిర్యాల, ఆగస్టు 4, ( ఆంజనేయులు న్యూస్ )

జిల్లాలో నవజాత శిశు, మాతృ మరణాలను మరింత తగ్గించేందుకు “సంకల్పం” కార్యక్రమాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ వైద్య అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల వైద్యులతో కార్యక్రమ పురోగతిని సమీక్షించారు. గర్భిణుల తొలి దశలోనే నమోదు, హైరిస్క్ గర్భిణుల గుర్తింపు, సాధారణ ప్రసవాల ప్రోత్సాహం, సి-సెక్షన్ల ఆడిట్, ఎస్‌ఎన్‌సీయూ (SNCU) కేంద్రాల్లో నిపుణుల సేవలు, నవజాత శిశువులకు అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఆశా కార్యకర్తలు, నర్సింగ్ అధికారులు, వైద్యులకు రీ-ఒరియంటేషన్ శిక్షణలు నిర్వహించి, బాలింతల ఇళ్లకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 12,161 మంది గర్భిణులు నమోదు కాగా, 100 శాతం నమోదు లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో నవజాత శిశు మరణాలు కేవలం ఐదు మాత్రమే నమోదయ్యాయని, మరింత తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రేడియాలజిస్టులు, పీడియాట్రిషన్లు, గైనకాలజిస్టుల సేవలు అన్ని ప్రభుత్వ వైద్య సంస్థల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, 108 నవజాత శిశు అంబులెన్స్ సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్య సంస్థలు, ఆశా కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ కోటేశ్వరరావు, డాక్టర్ రవి, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ స్రవంతి, డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ అరుణశ్రీ, డాక్టర్ వనిత, డాక్టర్ ఆశాశ్రీ, రేడియాలజిస్టులు, గైనకాలజిస్టులు, డీపీఓ శ్రీమతి ప్రశాంతి, జిల్లా మాస్ మీడియా అధికారి కుక్క బుక్కా వెంకటేశ్వర్, నామదేవ్ చారి, సురేందర్, వెంకట సాయి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.