నిర్మల్ జూలై 24, ( ఆంజనేయులు న్యూస్ )
నిర్మల్ జిల్లాలో సంచలనం సృష్టించిన అస్లాం ఖాన్ హత్య కేసును నిర్మల్ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు బృందాలు అంతర్రాష్ట్ర సుపారీ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసి కేసును ఛేదించాయి. పోలీసుల దర్యాప్తులో ప్రధాన కుట్రదారుగా అన్వరీ బేగం ఉన్నట్లు తేలింది. వ్యక్తిగత విభేదాలు, అక్రమ సంబంధం బయటపడటం, అస్లాం ఖాన్ వివాహం చేసుకోవాలనే నిర్ణయంపై ఏర్పడిన కక్షతో మహారాష్ట్రకు చెందిన నిందితులకు రూ.6 లక్షల సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. జూలై 15న నిర్మల్ పట్టణంలోని వైఎస్సార్ కాలనీ సమీపంలో అస్లాం ఖాన్‌పై కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. నిందితులు ముందుగా రెక్కీ నిర్వహించి, బాధితుడి కదలికలను ప్రధాన కుట్రదారు ద్వారా తెలుసుకుంటూ పక్కా ప్రణాళికతో నేరానికి పాల్పడ్డారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా విశ్లేషణ ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, నేరానికి ఉపయోగించిన స్కార్పియో కారు, మోటార్ సైకిల్, రెండు కత్తులు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును వేగంగా ఛేదించిన ప్రత్యేక పోలీసు బృందాలను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల అభినందించారు. దర్యాప్తులో సహకరించిన ఇతర పోలీసు అధికారుల సేవలను కూడా ఆమె ప్రత్యేకంగా ప్రశంసించారు.
