మంచిర్యాల, జూలై 22, ( ఆంజనేయులు న్యూస్ )
ఏఐసీసీ, పీసీసీ నాయకత్వం, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కేంద్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని ఆరోపిస్తూ మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం గాంధీ పార్క్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల నరేష్, కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ, ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజ్ అంశంపై విద్యార్థులు నిర్వహించిన ధర్నాపై కేంద్ర ప్రభుత్వం లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. విద్యార్థులకు అండగా నిలిచిన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే చర్య అని పేర్కొన్నారు. రైతులు, యువత, నిరుద్యోగులు, మహిళల సమస్యలపై ప్రశ్నించినందుకే కాంగ్రెస్ నాయకులను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజ్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు.
