36 గ్రాముల బంగారం, 25.5 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం
సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు ఎస్పీ అఖిల్ మహాజన్ సూచన
ఆదిలాబాద్, జూలై 20, ( ఆంజనేయులు న్యూస్ )
ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా నమోదైన ఇంటి చోరీ కేసులను పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో ఛేదించి, నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 36 గ్రాముల బంగారు ఆభరణాలు, 25.5 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 18న ఆదర్శ్‌నగర్‌కు చెందిన నైతం గణేష్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని, సంఘటన స్థలాన్ని పరిశీలించి సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయి సమాచారంతో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన ఇంటి చోరీలకు పాల్పడే ముఠాను గుర్తించి అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితులు మహారాష్ట్రలోని వర్ధా, భండారా జిల్లాలకు చెందిన షిండే సునీల్ అలియాస్ రాకీ, కుమ్రే సుజల్ యురాజ్, మార్జివే శేఖర్, గాయకవాడ్ లక్ష్మణ్‌గా పోలీసులు తెలిపారు. విచారణలో మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శ్‌నగర్, టైలర్స్ కాలనీల్లో నమోదైన క్రైమ్ నంబర్లు 34/2026, 35/2026, 41/2026 కేసులకు పాల్పడినట్లు వారు ఒప్పుకున్నారని వెల్లడించారు. పోలీసులు నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తులో 36 గ్రాముల బంగారు ఆభరణాలు, 25.5 తులాల వెండి ఆభరణాలు ఉన్నాయి. మిగిలిన చోరీ సొత్తు స్వాధీనం చేసుకోవడంతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో నమోదైన ఇతర కేసుల్లో వీరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడు ఏ1పై గతంలో 8 దొంగతనం కేసులు, ఏ2పై 3 కేసులు నమోదై ఉన్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎస్పీ పలు సూచనలు చేశారు. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని, సాధ్యమైనంత వరకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఇంట్లో అధిక మొత్తంలో నగదు, విలువైన ఆభరణాలు భద్రత లేకుండా ఉంచవద్దని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, అనుమానాస్పద కదలికలు గమనించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-100కు సమాచారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, మావల సీఐ బి.డి. ప్రేమ్ కుమార్, ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
