కుటుంబానికి భద్రత కల్పించి.. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి: నగ్నూరి వెంకటేశ్వర్ గౌడ్
మంచిర్యాల, జూలై 8, ( ఆంజనేయులు న్యూస్ )
మంచిర్యాల మండలం మాజీ ఎంపీపీ, బీజేపీ నాయకుడు బేర సత్యనారాయణ నివాసంపై జరిగిన దాడిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగ్నూరి వెంకటేశ్వర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. రాత్రి సమయంలో కొందరు వ్యక్తులు ఇంటిపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు తలుపులు బలవంతంగా తెరవడానికి ప్రయత్నించి, కుటుంబ సభ్యులను బెదిరించారని ఆరోపించారు. రాజకీయ విభేదాలను ప్రజాస్వామ్యబద్ధంగా వ్యక్తపరచాలని, వ్యక్తిగత దాడులు, రౌడీయిజానికి సమాజంలో స్థానం లేదని ఆయన పేర్కొన్నారు. బేర సత్యనారాయణ అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే కక్షసాధింపుతో ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బేర సత్యనారాయణ కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలని ప్రభుత్వం, పోలీసు శాఖను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు సత్రం రమేష్, అమరశెట్టి రాజు, బోట్ల సత్యనారాయణ, అనిత, నాగరాజు, ఆకుల అశోక్ వర్ధన్, కమలాకర్ రావు, పానుగంటి మధు, దుర్గం అశోక్, మోటపలుకుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు