Tuesday, August 18, 2026
HomeTelangana"ఒకే చదువు.. నాలుగు డ్రెస్‌లు..! తల్లిదండ్రుల జేబులకు చిల్లు"

“ఒకే చదువు.. నాలుగు డ్రెస్‌లు..! తల్లిదండ్రుల జేబులకు చిల్లు”

📰 Generate e-Paper Clip

ప్రైవేట్ స్కూళ్ల డ్రెస్ కోడ్‌లపై పేరెంట్స్ ఆవేదన

విద్యాశాఖ జోక్యం కోరుతున్న తల్లిదండ్రులు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: విద్య పేరుతో ఇప్పటికే భారీ ఫీజులు వసూలు చేస్తున్న కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఇప్పుడు డ్రెస్ కోడ్‌ల పేరుతో తల్లిదండ్రులపై మరింత ఆర్థిక భారం మోపుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ యూనిఫామ్‌తో సరిపెట్టకుండా హౌస్ డ్రెస్, స్పోర్ట్స్ డ్రెస్, యాక్టివిటీ డ్రెస్, ప్రత్యేక కార్యక్రమాల కోసం వేర్వేరు దుస్తులను తప్పనిసరి చేస్తుండటంతో తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి విద్యార్థికి ఒకే ఏడాదిలో మూడు నుంచి నాలుగు రకాల డ్రెస్‌లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొనగా, కొన్ని పాఠశాలలు సూచించిన ప్రత్యేక దుకాణాల నుంచే వాటిని కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో వేల రూపాయల అదనపు ఖర్చు భరించాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. మరోవైపు, కొన్ని పాఠశాలలు ప్రతి ఏడాది యూనిఫామ్ డిజైన్ మార్చడం వల్ల గత సంవత్సరం కొనుగోలు చేసిన డ్రెస్‌లు ఉపయోగపడకుండా పోతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు చదువుతున్న కుటుంబాలకు ఇది మరింత భారంగా మారిందని చెబుతున్నారు. విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా మార్చుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఈ వ్యవహారంపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి విచారణ చేపట్టాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. “విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్య అవసరం… కానీ డ్రెస్ కోడ్‌ల పేరుతో తల్లిదండ్రులపై భారాలు మోపడం సమంజసం కాదు” అని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.