ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి
పీ.ఎం. శ్రీ పాఠశాలల వ్యక్తిత్వ వికాస నిపుణులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్ పిలుపు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: పరీక్షల సమయంలో ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని రాష్ట్రపతి అవార్డు గ్రహీత, పీ.ఎం. శ్రీ పాఠశాలల వ్యక్తిత్వ వికాస నిపుణులు గుండేటి యోగేశ్వర్ విద్యార్థులకు సూచించారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న సందర్భంగా మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం భీమారం పీ.ఎం. శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. “గతంలో ఎన్నో పరీక్షలు రాసిన అనుభవంతో ఈ పదో తరగతి పరీక్షలను కూడా అవలీలగా విజయవంతంగా పూర్తి చేయగలరు” అని విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపారు.
• విజయ సూత్రాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్:
పరీక్షల్లో విజయం సాధించడానికి అవసరమైన “విజయ సూత్రాలు – బలాలు, బలహీనతలు – సక్సెస్ మంత్ర – ఆత్మవిశ్వాసం” వంటి అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పరీక్షల ముందు, పరీక్ష రోజు ఎలా చదవాలి, జ్ఞాపకశక్తిని ఎలా పెంపొందించుకోవాలి వంటి ప్రాయోగిక పద్ధతులను నేర్పించారు.
• ప్రేరణాత్మక జీవన గాథలు:
పేదరికం నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రముఖుల జీవిత కథలను వివరించి విద్యార్థుల్లో మనోధైర్యం పెంపొందించారు. విద్యార్థులు అడిగిన పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చి వారికి స్పష్టత కల్పించారు.
• నిర్భయంగా రాస్తామని ప్రతిజ్ఞ:
పరీక్షలను నిర్భయంగా, ఆత్మవిశ్వాసంతో విజయవంతంగా రాస్తామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్.ఎం. జి. శ్రీనివాస్, సమన్వయకర్త తిరుపతి, ఉపాధ్యాయులు షారీక్, మారయ్య, సలీం, శ్రీదేవి, గోవర్ధన చారి, ఐటి నిపుణులు ఎం. శరత్ చంద్ర, ఎస్. రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
