Monday, August 17, 2026
HomeTelanganaTMSRU సర్వ సభ్య సమావేశం విజయవంతం

TMSRU సర్వ సభ్య సమావేశం విజయవంతం

📰 Generate e-Paper Clip

ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని పిలుపు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తెలంగాణా మెడికల్ & సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ (TMSRU) మంచిర్యాల శాఖ సర్వ సభ్య సమావేశం సోమవారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి జి. విద్యాసాగర్ హాజరై సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. యూనియన్లైన FMRAI, TMSRU గత కొన్ని సంవత్సరాలుగా ఔషధాలపై సున్నా శాతం జీఎస్టీ కోసం చేసిన పోరాటాల ఫలితంగా ప్రభుత్వం కొన్ని అవసరమైన మందులపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించిందని తెలిపారు. ఇది గత సంవత్సరం సాధించిన గొప్ప విజయమని పేర్కొన్నారు. అయితే మందులు, వైద్య పరికరాలపై పన్నుల భారాన్ని పూర్తిగా తొలగించే వరకు పోరాటం కొనసాగాలని స్పష్టం చేశారు. ఔషధాల ధరలను మార్కెట్ ధరల ఆధారంగా కాకుండా ఉత్పత్తి ధరల ఆధారంగా నిర్ణయిస్తే ప్రజలకు మందులు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఆన్‌లైన్‌లో మందుల విక్రయం వల్ల ప్రజలకు అనవసరమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున, ఆన్‌లైన్ ఔషధ విక్రయాలను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం కల్తీ, నాసిరకం దగ్గు టానిక్‌ల కారణంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో చిన్నారులు మరణించిన ఘటనలు దేశాన్ని కలచివేశాయని, ఇది ఔషధ నాణ్యత నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. నకిలీ మందులు తయారు చేసే ఫార్మా కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

కొత్త నాలుగు కార్మిక కోడ్‌లు కార్మికుల ఉద్యోగ భద్రతను తగ్గించి, ట్రేడ్ యూనియన్లను బలహీనపరచే విధంగా ఉన్నాయని విమర్శించారు. “ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్” పేరుతో ఉద్యోగ భద్రతను కాలరాస్తున్నారని ఆరోపించారు. అలాగే మెడికల్ & సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఎన్నో ఏళ్ల పోరాటంతో సాధించుకున్న Sales Promotion Employees Act – 1976ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెలో దేశవ్యాప్తంగా మెడికల్ & సేల్స్ రిప్రజెంటేటివ్స్ పాల్గొంటారని తెలిపారు.

• నూతన కార్యవర్గం ఎన్నిక:

సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు: పి. కుమార్, కార్యదర్శి: వి. సంతోష్, కోశాధికారి: బి. వెంకటేష్, ఉపాధ్యక్షులు: రామకృష్ణ, రాకేశ్, సహాయ కార్యదర్శులు: రమేష్, మహేందర్, ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఎల్. సాగర్ రెడ్డి, ఉద్యోగ సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ రాజేశం, అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.