Monday, August 17, 2026
HomeTelanganaకాకా ఇంట్లో మూడో మంత్రి పదవి

కాకా ఇంట్లో మూడో మంత్రి పదవి

📰 Generate e-Paper Clip

అప్పుడు తండ్రి.. అన్న..

ఇప్పుడు మంత్రిగా వివేక్ వెంకటస్వామి ప్రమాణ స్వీకారం

అమాత్యయోగం కాకా కుటుంబాన్ని వరించింది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను మంత్రి పదవి వరించటం కూడా మూడోదే

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: అమాత్యయోగం కాకా కుటుంబాన్ని వరించింది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదివారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గడ్డం వెంకటస్వామి ఇంట్లో మూడో మంత్రి పదవి.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను మంత్రి పదవి వరించటం కూడా మూడోదే. ఉమ్మడి జిల్లా నుంచి పట్టుబట్టి మంత్రి పదవి సాధించడంలో సఫలీకృతమయ్యారు. ఉమ్మడి జిల్లాను అభివృద్ధి, సంక్షేమంలో మరింత ముందుకు తీసుకెళ్తారని జిల్లావాసులు భావిస్తున్నారు.
కాంగ్రెస్ దివంగత నేత గడ్డం వెంకటస్వామి అంటే అందరికీ కాకాగా సుపరిచితులు. మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఏడుసార్లు ఎంపీగా, అందులోనూ మూడుసార్లు కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనది. అందుకే ఆయన బతికి ఉన్నప్పుడు కాకా అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే కాకా అన్నట్లు నడిచేది. ఆ క్రమంలోనే ఆయన పెద్దకుమారుడు (ప్రస్తుత బెల్లంపల్లి ఎమ్మెల్యే) వినోద్ వైఎస్ఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. కాకా దివంగతులైన తర్వాత ఆ కుటుంబంలో రాజకీయ ప్రాధాన్యం కొంత తగ్గిందనే భావన ఉంది. కానీ ఇప్పుడు మళ్లీ అదే కుటుంబంలో మునుపటిలా రాజకీయ సందడికి ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్రమంత్రిగా తండ్రి వెంకటస్వామి, వైఎస్సార్ కేబినెట్ లో రాష్ట్రమంత్రిగా అన్న వినోద్ రాజకీయ ప్రభ వెలిగితే, దానికి భిన్నంగా వివేక్ నడిపిన రాజకీయ చతురతతో ఇపుడు ఔరా? అనిపించేలా చేస్తోంది. శాసనసభఎన్నికల ముందు చివరి నిమిషంలో భాజపాను వీడి కాంగ్రెస్ లో చేరడంతో పాటు కోరుకున్న చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. లోక్సభ ఎన్నికల్లో తన తనయుడు వంశీకృష్ణను పెద్దపల్లి ఎంపీగా గెలిపించుకోవటంలో సఫలీకృతుడయ్యారు. వివేక్ తన పట్టు నెరవేర్చుకునేలా తాజాగా రేవంత్ రెడ్డి జట్టులో మంత్రిపదవి పొందటం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

• మూడో మంత్రి:

తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ తొలి మంత్రి వర్గంలో జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డిలను మంత్రి పదవులు వరించాయి. తొలుత జోగు రామన్న ఒక్కరే మంత్రిగా ఉన్నప్పటికీ ఆ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి భారాసలో చేరారు. తర్వాత కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు. తర్వాత కేసీఆర్ రెండోసారి కేబినెట్లో మంత్రి పదవి ఇంద్రకరణ్ రెడ్డి ఒక్కరికే పరిమితమైంది. ఇప్పుడు వివేక్ తో మూడోసారి మంత్రి పదవి దక్కింది. సొంతపార్టీ కాంగ్రెస్ నుంచి ప్రేమ్ సాగర్ రావు నుంచి గట్టిపోటీ ఎదురైంది. ఓ దశలో సోదరుడు వినోద్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పేర్లూ వినిపించాయి. వినోద్, వివేక్ కు రాజకీయ అనుభవం ఉన్నా ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన తొలిసారే మంత్రులు కావడం విశేషం.

• నెరవేరిన కల:

పెద్దపల్లి ఎంపీగా 2009లో విజయం సాధించిన వివేక్ ను కేంద్ర మంత్రి పదవి వరిస్తుందనే ప్రచారం జరిగింది. ఆయనకంటే సీనియర్ నేతలు ఉండటంతో పదవి చేజారింది. తర్వాత దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని తెరాస నేత కేసీఆర్ ప్రకటించటంతో 2013లో వివేక్ ఆ పార్టీలో చేరారు. ఆతర్వాత రాజకీయ పరిణామాలు మారాయని భావించిన ఆయన 2014 ఎన్నికల ముందు తెరాసను వీడి తిరిగి కాంగ్రెస్లో చేరారు. చెన్నూరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. మళ్లీ 2016లో తెరాసలో చేరినప్పటికీ 2019లో ఆ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వలేదు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన తెరాసను వీడి భాజపాలో చేరారు. కానీ ఆ దఫా ఎన్నికల్లో పోటీ చేయలేదు. భాజపా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా 2024లో వివేక్ కు టికెట్ ఖాయమని ప్రచారం జరిగినా ఆయన అనూహ్యంగా 2023లో కాంగ్రెస్ గూటికి చేరారు. చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు మంత్రి పదవి ఆయన సొంతమైంది.

• వీటిపై దృష్టి సారించాలి:

• పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శ్రేణులతో సమన్వయం చేసుకోవడం

• సొంత జిల్లా అయిన మంచిర్యాల సహా ఆదిలాబాద్, కుమురంభీం, నిర్మల్లో పార్టీని వచ్చే స్థానిక సంస్థలకు సిద్ధం చేయడం.

• ఉమ్మడి జిల్లా అధికారులకు ప్రగతి పనులపై దిశానిర్దేశం చేయడం.

• సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు పారదర్శకంగా అందేలా చూడటం.

• చనాఖా-కోర్ట, ప్రాణహిత- చేవెళ్ల, అడ, గడ్డెన్నవాగు ప్రాజెక్టులు సహా చిన్న నీటి పథకాలు సఫలీకృతమయ్యేలా చర్యలు చేపట్టటం.

అభివృద్ధి పనులను అన్ని నియోజకవర్గాలకు ప్రాధాన్యం ఉండేలా చూడటం ప్రస్తుతం వివేక్ చేపట్టాల్సిన తక్షణ కర్తవ్యాలు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.