రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం భూభారతి చట్టంలో పైలట్ మండలం గా ఎంపిక చేసిన జిల్లాలోని పెంచికల్ పేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తనసరి అనసూయ (సీతక్క), ఉమ్మడి జిల్లా శాసనమండలి సభ్యులు దండే విఠల్, రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, జిల్లా కలెక్టర్ వెంకటేష్, దోత్రే, ఎస్.పి. శ్రీనివాస్ రావు, జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం. డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్, సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు లతో కలిసి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, మేధావుల సూచనలు, 18 రాష్ట్రాలలోని భూ చట్టాలపై అధ్యయనం చేసి న్యాయనిపుణుల సలహాలు, ప్రజల అభిప్రాయాలతో రూపొందించిన భూభారతి చట్టంలోని అంశాలు ప్రతి రైతు సమస్యకు పరిష్కార మార్గం చూపుతుందని తెలిపారు. జూన్ 2వ తేదీ నాటికి పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న మండలాలలో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ధరణి లో గల లోపాలు, సమస్యల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, భూ సమస్యల పరిష్కారం కొరకే ధరణి పోర్టల్ రద్దుచేసి భూ భారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈ చట్టం అమలులో రెవెన్యూ శాఖ అధికారులు కీలక పాత్ర పోషిస్తారని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేసే రైతుల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. జూన్ 2వ తేదీ నాటికి 10 వేల 956 గ్రామాలలో గ్రామ పాలన అధికారుల వ్యవస్థ ప్రారంభిద్దామని తెలిపారు. రెగ్యులర్ సర్వేయర్లు కాకుండా ఇంకా 5 వేల మంది లైసెన్స్ సర్వేయర్లను 3 నెలల పాటు శిక్షణ అందించి నియమించడం జరుగుతుందని తెలిపారు. రానున్న రోజులలో అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, అధికారుల సమన్వయంతో అర్హుల జాబితా రూపొందించడం జరిగిందని తెలిపారు. అటవీశాఖ అధికారులు పోడు సాగు చేసే వారి పట్ల అత్యుత్సాహం ప్రదర్శించకూడదని, పంట సాగుకు అడ్డు పడకూడదని తెలిపారు. జిల్లాలోని రైతుల భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం దిశగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి మాట్లాడుతూ భూమితోనే మానవ జీవితం ముడిపడి ఉందని, గత ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో భూ సమస్యలు పెరిగాయని, గత ప్రభుత్వంలో భూమి లేకుండా పట్టాలు చేశారని, అసలు పట్టాదారుకు భూమి దక్కకుండా పోయిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ద్వారా సాదా బైనమాల పరిష్కారానికి మార్గం లభిస్తుందని, ప్రతి రైతు భూ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండేవిటల్ మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, పోడు సాగు చేసుకునే వారికి అటవీ అధికారులు అడ్డు పడకూడదని తెలిపారు. అర్హులైన లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అధికారులు నిబంధనల ప్రకారం తమ వంతు ప్రోత్సాహం అందించాలని తెలిపారు.
రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలో భూభారతి చట్టం ల్యాండ్ మార్క్ గా నిలుస్తుందని తెలిపారు. ధరణి వ్యవస్థలోని లోపాలతో భూ సమస్యలు తలెత్తాయని అన్నారు. భూభారతి చట్టంలో పొందుపరిచిన అంశాల ద్వారా భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందని, న్యాయస్థానాలకు వెళ్లే అవసరం ఉండదని, మండల తహసిల్దార్ నుండి జిల్లా కలెక్టర్ స్థాయిలలో భూ సమస్యల పరిష్కారం జరుగుతుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భూభారతి చట్టంలో జిల్లాలోని పెంచికల్ పేట మండలం పైలట్ మండలంగా ఎంపిక చేయడం జరిగిందని, జిల్లాలోని 15 మండలాలలో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి చట్టంలోని అంశాలు, హక్కులను వివరించడం జరిగిందని తెలిపారు. పెంచికల్ పేట మండలంలోని 19 రెవెన్యూ గ్రామాలలో ఇప్పటికే నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో 236 దరఖాస్తులు వచ్చాయని, 84 దరఖాస్తులు పరిష్కరించడం జరిగిందని, మిగతా 152 దరఖాస్తులు సాదా బైనమా, పి. ఓ. టి. కేసులు, తన సమస్యలపై వచ్చాయని తెలిపారు. జూన్ 2వ ఏది నాటికి మిగతా మండలాలలో రెవిన్యూ సదస్సుల నిర్వహణకు యంత్రంగాన్ని సిద్ధంగా ఉంచామని తెలిపారు.
సిర్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు మాట్లాడుతూ.. ఈ ప్రాంతం నుండి ప్రాణహిత నది ప్రవహిస్తున్న సాగునీటికి ఉపయోగం లేకుండా ఉందని, తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు నిర్మాణం కొరకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సర్వేలు నిర్వహించి నిర్మాణాలు చేపట్టి ఈ ప్రాంత భూములకు సాగునీటిని అందించాలని కోరారు. ఈ ప్రాంతంలో ఎక్కువమంది రైతులు ఆదివాసీలేనని, వారు పోడు వ్యవసాయ సాగు చేస్తున్నారని, అటవీశాఖ అధికారులు పోడు సాగును అడ్డుకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి పోర్టల్ కారణంగా ప్రజలు, రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ఈ ప్రభుత్వం తీసుకువచ్చిన భారతి చట్టంలో పేద రైతుల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
అంతకుముందు నిర్మల్ నుండి హెలికాప్టర్ ద్వారా వచ్చిన రాష్ట్ర మంత్రులను హెలిప్యాడ్ వద్ద జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
