Tuesday, August 18, 2026
HomeCrimeగర్భస్థ లింగ నిర్థార్ధణ పరీక్షలు నేరము

గర్భస్థ లింగ నిర్థార్ధణ పరీక్షలు నేరము

📰 Generate e-Paper Clip

జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా॥ అనిత

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నేరమని, పరీక్షలు నిర్వహించినా, చేసుకున్నా, ప్రోత్సహించినా శిక్షార్హులు అవుతారని జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా॥ అనిత అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో శాఖ అధికారులు, వైద్యాధికారులతో జిల్లా స్థాయి అడ్వయిజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలో పి.సి.పి.ఎన్.డి.టి. చట్టం క్రింద 45 స్కానింగ్ ఆసుపత్రులు పని చేస్తున్నాయని, 12 ఆసుపత్రులు రెన్యువల్ కోసం, 2 ఆసుపత్రులు కొత్తగా స్కానింగ్ సెంటర్ల మంజూరు కొరకు పి.సి.పి.ఎన్.డి.టి. లో నమోదు చేసుకోగా వివరాలను పరిశీలించి సర్టిఫికెట్ మంజూరు కొరకు ఉన్నతాధికారులకు పంపించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని కళాశాలలలో, శిక్షణ కేంద్రాలలో, దిశా కార్యక్రమాలలో, గ్రామపంచాయతీలలో గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిరోధంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. “పుట్టబోయేది ఆడబిడ్డ, మగబిడ్డ అని అడగవద్దు – అది చట్ట రీత్యా నేరము”, “గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే స్త్రీ / పురుష లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరము”, “లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారికి, చేయించుకున్న వారికి, అందుకు ప్రోత్సహించిన వారికి చట్టరీత్యా శిక్ష ఖాయము” అని ప్రజలందరికీ తెలిసే విధంగా స్కానింగ్ సెంటర్లలో ప్రదర్శించాలని తెలిపారు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడిన వారికి 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించబడుతుందని, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు, ప్రజలకు తెలియజేసే విధంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా నిబంధనల ఉల్లంఘన చర్యలకు పాల్పడినట్లయితే 104 కు ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలతో సన్నిహితంగా ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని, గ్రామాలలో ఆశ, అంగన్వాడీ కార్యకర్తల ద్వారా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యాధికారుల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు గర్భిణుల కోసం మౌళిక వసతులు కల్పించాలని, గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధంపై వారి కేంద్రాలలో స్థానిక భాషలలో ప్రజలకు అర్థమయ్యే విధంగా గోడప్రతులు అతికించాలని, ఆయా కేంద్రాల వారి సర్టిఫికెట్లను ప్రదర్శించాలని తెలిపారు. అనంతరం గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధానికి సంబంధించి గోడప్రతులను నోడల్ అధికారి డా|| నీరజ, వైద్యులు డా॥ రాధిక, డా॥ కోటేశ్వరరావు, డా॥ సుధాకర్, డా॥ రాజ్ కిరణ్, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.