మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్ తో కలిసి మంచిర్యాల రాజస్వ మండల అధికారి వి.రాములు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 136, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 89, మెప్మా ఆధ్వర్యంలో 10, డి.సి.ఎం.ఎస్. ఆధ్వర్యంలో 51 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నిబంధనల మేరకు రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు 12 వేల 722 మంది రైతుల వద్ద నుండి 84 వేల 544 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 186 కోట్ల 25 లక్షల రూపాయలు జమ చేయవలసి ఉండగా ఇప్పటి వరకు 5 వేల 96 మంది రైతుల ఖాతాలలో 73 కోట్ల 2 లక్షల రూపాయలు జమ చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు 7 వేల 554 మంది రైతుల వివరాలు ట్యాబ్లలో నమోదు చేయడం జరిగిందని, మిగతా వివరాలను తక్షణమే ట్యాబ్లలో నమోదు చేసి సంబంధిత రైతుల ఖాతాలలో నగదు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ట్యాగింగ్ చేయబడిన రైస్ మిల్లుల సామర్థ్యానికి అనుగుణంగా ధాన్యం తరలించడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 78 వేల 931 మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించడం జరిగిందని తెలిపారు. ధాన్యం తరలించేందుకు అవసరమైన గన్నీ సంచులు సరిపడా అందుబాటులో ఉన్నాయని, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ధాన్యం తడవకుండా టార్పాలిన్లను అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. రైస్ మిల్లులకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసే విధంగా రైస్మిల్లుల యజమానుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాల నుండి లారీల ద్వారా తరలించిన ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేసుకొని వాహనాలను తిరిగి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైస్ మిల్లుల వారిగా కేటాయించిన సి.ఎం.ఆర్. లక్ష్యాలను సాధించడంలో ఏమైనా సమస్యలు తలెత్తినట్లయితే త్వరగా పరిష్కరించి లక్ష్యాలను పూర్తి చేసే విధంగా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ట్యాబ్ ఎంట్రీ, సి.ఎం.ఆర్. ప్రక్రియ నిర్వహణ వివరాలతో ప్రతి రోజు నివేదిక అందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
