Tuesday, August 18, 2026
HomeTelanganaమంత్రి శ్రీధర్ బాబు సాక్షిగా భగ్గుమన్న గ్రూప్ విభేదాలు

మంత్రి శ్రీధర్ బాబు సాక్షిగా భగ్గుమన్న గ్రూప్ విభేదాలు

📰 Generate e-Paper Clip

హాజరుకాని ముగ్గురు ఎమ్మెల్యేలు

గౌరవం ఇవ్వలేదంటూ ప్రభాకర్ ఆగ్రహం

కష్టపడిన కార్యకర్తలకు అన్యాయం జరగనివ్వం: మంత్రి శ్రీధర్ బాబు

ఆంజనేయులు న్యూస్, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఆర్పీ గార్డెన్ లో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు హాజరై మాట్లాడారు.. పదేళ్ల భారాస పాలనలో ప్రాణాలకు తెగించి పార్టీ కోసం కష్టపడిన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరగనివ్వమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల కాలంలోనే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చామన్నారు. భారాస హయాంలో ధాన్యం క్వింటాకు 10 కిలోల నుంచి 12 కిలోల వరకు తరుగు తీసి రైతులను దోచుకున్నారని ఆరోపించారు. వేసవిలో మంచినీటి ఎద్దడి లేకుండా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా వంశీ ప్రజలకు సేవ చేయడానికి వచ్చాడన్నారు. కష్టపడిన కార్యకర్తలకు సర్పంచులు, ఎంపీటీసీలుగా అవకాశం కల్పిస్తామన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తామన్నారు.
ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ఇష్టానుసారం దోచుకున్నారని ఆరోపించారు. భాజపా, భారాసకు లోపాయికారి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. కాంగ్రెస్ లో చేరగానే తమపై ఈడీ దాడులు చేశారన్నారు..
ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ.. బెల్లంపల్లి ప్రజలకు గోదావరి నీళ్లు అందజేస్తామన్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ మాట్లాడుతూ. భారాస పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడ్డారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని భారాస అప్పులపాలు చేస్తే.. కాంగ్రెస్ గాడిలో పెడుతుందన్నారు.
ఎంపీ అభ్యర్థి వంశీ మాట్లాడుతూ.. పెద్దపల్లి నియోజకవర్గంపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. బెల్లంపల్లికి ఇంజినీరింగ్ కళాశాలతోపాటు గోదావరి నీళ్లు అందిస్తామన్నారు. నిరుద్యోగ సమస్య తీర్చడానికి పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రయత్నిస్తానని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, మాజీ ఎమ్మెల్సీ వెంకట్ రావు, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక ప్రసాద్ నాయకులు కేవీ ప్రతాప్, టీపీసీసీ సభ్యుడు చిలుముల శంకర్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఎం.సూరిబాబు, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ కారుకూరి రాంచందర్, మున్సిపల్ ఛైర్పర్సన్ జక్కుల శ్వేత, నాయకులు పాల్గొన్నారు.

• హాజరుకాని ముగ్గురు ఎమ్మెల్యేలు

బెల్లంపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ గైర్హాజయ్యారు. డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ సైతం సమావేశానికి దూరంగా ఉన్నారు. వీరంతా హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

• గౌరవం ఇవ్వలేదంటూ ప్రభాకర్ ఆగ్రహం.?

కష్టపడిన కార్యకర్తలకు గౌరవం ఇవ్వలేదంటూ కాంగ్రెస్ సమావేశంలో ఓబీసీ రాష్ట్ర నాయకుడు బండి ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సమావేశం కొనసాగుతుండగానే ఒక్కసారిగా వేదిక పైకి వచ్చి మైక్ చేతిలో పట్టుకుని నాయకులు, కార్యకర్తలను పట్టించుకోవాలని సూచించారు. ఇంతలో వేదికపై ఉన్న నాయకులు జోక్యం చేసుకుని సముదాయించడంతో గొడవ సమసిపోయింది..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.