Tuesday, August 18, 2026
HomeTelanganaఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలి

ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలి

📰 Generate e-Paper Clip

జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: లోక్సభ ఎన్నికలు-2024 కార్యచరణ విడుదల అయిన నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో ఎన్నికలు సజావుగా సాగేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, పోటీ చేయు అభ్యర్థులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్ అన్నారు. ఆదివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో రామగుండం కమీషనర్ ఆఫ్ పోలీస్ ఎ.శ్రీనివాస్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్, ప్రత్యేక ఉప పాలనాధికారి (ఎల్.ఎ., ఆర్తి&ఆర్) డి.చంద్రకళ, మంచిర్యాల రాజస్వ మండల అధికారి వి. రాములు, జైపూర్ ఎ.సి.పి. వెంకటేశ్వర్లుతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్, ఖర్చులు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ. లోక్సభ ఎన్నికలలో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జిల్లాలో 002-చెన్నూర్ (ఎస్.సి.), 003-బెల్లంపల్లి (ఎస్.సి.), 004-మంచిర్యాల శాసనసభ నియోజకవర్గాలలో 741 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఏప్రిల్ 18వ తేదీన లోక్సభ ఎన్నికల సంబంధిత గెజిట్ నోటిఫికేషన్ విడుదల అవుతుందని, నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏప్రిల్ 25వ తేదీ ఆఖరు రోజు అని, 26వ తేదీన నామినేషన్లను పరిశీలించడం జరుగుతుందని, 29వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవ్చని, మే 13వ తేదీన పోలింగ్, జూన్ 4వ తేదీన కౌంటింగ్ కార్యక్రమాలు ఉంటాయని, జూన్ 6వ తేదీన ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని, అప్పటి వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని తెలిపారు.

నామినేషన్ స్వీకరించే సమయంలో సి.సి. కెమెరాతో పాటు వీడియో చిత్రీకరణ ద్వారా రికార్డు చేయడం జరుగుతుందని, నిర్ణీత సమయంలోగా నామినేషన్లు దాఖలు చేయాలని తెలిపారు. నామినేషన్ దాఖలు చేయు సమయంలో భారత ఎన్నికల సంఘం నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, నామినేషన్లను ఉపసంహరించుకోవాలనే అభ్యర్థులు నిర్ణీత సమయంలో ప్రక్రియ పూర్తి చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు తమ నామినేషన్లను ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చని, అట్టి నామినేషన్ ప్రతిని సంబంధిత రిటర్నింగ్ అధికారికి నిర్ణీత పని వేళలలో అందజేయాలని తెలిపారు. ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థులు ఎన్నికల సంబంధిత ఖర్చుల నిర్వహణ కొరకు నామినేషన్ దాఖలు చేయడానికి ముందుగానే ప్రత్యేక బ్యాంక్ ఖాతా తెరువాలని, వివరాలు నామినేషన్ లో నమోదు చేయాలని, ప్రతి చెల్లింపు లావాదేవీలను ఖాతా ద్వారా మాత్రమే చేయాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం అభ్యర్థికి గరిష్టంగా నిర్ధారించిన ఖర్చు పరిమితిని మించకుండా చూసుకోవాలని, ఎన్నికల ప్రచారం సందర్భంగా సభలు, సమావేశాలకు వినియోగించే సామాగ్రి, ప్రచారం కొరకు ఉపయోగించే కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్స్, స్పీకర్లు, ప్రకటనలు, సోషల్ మీడియాతో కలిపి ఇతరత్రా అన్ని రకాల ప్రచార సాధనాలకు నిర్దేశించిన ధరల ప్రకారం లెక్కించడం జరుగుతుందని తెలిపారు. కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలపై ముద్రించే వారు / ఏజెన్సీ వివరాలు ఖచ్చితంగా ముద్రించాలని, లేని పక్షంలో ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రాజకీయ పార్టీలు తమ పార్టీ తరుపున ఒక బూత్ స్థాయి ఏజెంట్ను నియమించి నూతన ఓటరు నమోదు కొరకు పూర్తి స్థాయిలో సహకరించేలా చూడాలని తెలిపారు. పోలింగ్ రోజు ఓటర్లు తమ ఓటు హక్కును ప్రభుత్వంచే జారీ చేయబడిన 12 రకాల గుర్తింపు కార్డుల ద్వారా ఉపయోగించుకోవచ్చని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లయితే సి- విజిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతి కొరకు సువిధ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, దినపత్రికలు, కేబుల్ ఛానళ్ళలో ప్రకటనల ప్రదర్శన కొరకు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. దివ్యాంగులకు, వయోవృద్ధులకు హోమ్ ఓటింగ్, ఎన్నికల విధులలో ఉన్న వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులకు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు తదిరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.