Monday, August 17, 2026
HomeTelanganaమా ఆయనే వదిలేయండి.. పీఎస్ కు వెళ్లి బతిమిలాడిన మహిళా ఎస్ఐ

మా ఆయనే వదిలేయండి.. పీఎస్ కు వెళ్లి బతిమిలాడిన మహిళా ఎస్ఐ

📰 Generate e-Paper Clip

అతడిని వదిలేసి మరో ముగ్గురు నిందితులపైనే కేసు

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: నేరం చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిన పోలీసులు.. తమ అనుకున్న వారిని మాత్రం వదిలేస్తున్నారు. తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఆర్జీఐఏ ఠాణాలో నకిలీ సర్టిఫికెట్ల దందాలో ప్రమేయమున్న వ్యక్తి పేరు బయటపడకుండా చేసిన వ్యవహారమే ప్రత్యక్ష ఉదాహరణ. నిందితుడు ఒక మహిళా ఎస్ఐ భర్త కావడమేనన్న ఆరోపణలొస్తున్నాయి.

అసలు కేసు ఇదీ..

మూడు నెలల క్రితం శంషాబాద్ కు చెందిన ప్రైవేటు ఉద్యోగి నాగేశ్వరరావు దూరవిద్యలో ఎంఎస్సీ కోర్సు చేసేందుకు తన సహోద్యోగి సాయిబాబును అడిగాడు. వీరిద్దరూ కలిసి ఓ కార్పొరేట్ కళాశాలలో పీఆర్ఒ గా పనిచేస్తున్న కొత్తపేటకు చెందిన సిద్ధు యాదవ్(36)ను, హయతనగర్ కు చెందిన బి. శివశంకర్ రెడ్డి (47)ని, సరూర్ నగర్ కు చెందిన బి. దేవేందర్ రెడ్డి(42) ని కలిశారు. సర్టిఫికెట్ ఇప్పిస్తానంటూ అడ్వాన్సు కింద రూ.40 వేలు తీసుకున్నాడు. జులై తొలివారంలో రెండు ఎంఎస్సీ కెమిస్ట్రీ పట్టాలు ఇచ్చారు. పరీక్షలు రాయకుండానే పత్రాలు ఎలా ఇచ్చారనే అనుమానంతో నాగేశ్వరరావు, సాయిబాబు వాటిని తనిఖీ చేయగా నకిలీవని తేలింది. వారు ఈ నెల 12న ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సదరు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురూ మరోవ్యక్తి పేరు చెప్పారు. ఇక్కడే సైబరాబాద్ పరిధిలో పనిచేసే ఓ మహిళా ఎస్ఐ రంగ ప్రవేశం చేశారు.

నేరుగా వెళ్ళి.. బతిమాలి

ఈ నకిలీ సర్టిఫికెట్ల దందాలో మహిళా ఎస్ఐ భర్త సైతం మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు మిగిలిన ముగ్గురూ పోలీసుల ముందు అంగీకరించారు. పోలీసులు విచారించేందుకు ప్రయత్నించగా సబ్ ఇన్స్పెక్టర్ ఆర్జీఐఏ పోలీసుల్ని సంప్రదించారు. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్త పాత్ర వెలుగులోకి రాకుండా చూడాలంటూ బతిమిలాడినట్లు సమాచారం. కేసు నమోదవ్వకుండా చూడాలంటూ వేడుకోవడంతో పోలీసులు నిందితుని పేరు తొలగించి మిగిలిన ముగ్గురిపైనే కేసు నమోదు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముగ్గురిని అరెస్టు చేసి స్టేషన్ బెయిలు ఇచ్చి వదిలేశారు. వాస్తవానికి ఈ కేసులో ఉస్మానియా డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లు-38, జేఎన్టీయూ బీటెక్ పట్టాలు- 05, ఆంధ్రా, ఆచార్య నాగార్జున, కృష్ణ దేవరాయ, కాకతీయ, వెంకటేశ్వర యూనివర్సిటీలు, కొలరాడో స్టేట్ ఆఫ్ యూనివర్సిటీ, ఇందూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన సర్టిఫికెట్లు పట్టుబడ్డాయి. డబ్బులిస్తే అంగట్లో సరకులా ధ్రువీకరణ పత్రాలు విక్రయించే వ్యక్తుల్ని స్టేషన్ బెయిలు ఇవ్వడం విస్మయానికి గురిచేస్తోంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.