
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: బ్యాంకర్లకు కేటాయించిన నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో చేసే విధంగా సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ట్రైనీ కలెక్టర్ పి. గౌతమి, జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి మహిపాల్ రెడ్డితో కలిసి బ్యాంకుల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లా ఆర్థిక రుణ ప్రణాళికలో స్వల్పకాలిక రుణాలు 1 వేయి 951 కోట్ల రూపాయలు, వ్యవసాయ దీర్ఘకాలిక రుణాలు 609 కోట్ల రూపాయలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా రుణాలు 687 కోట్ల రూపాయలు, విద్యా రుణాలు 121 కోట్ల రూపాయలు, ప్రాధాన్యత రంగ గృహ రుణాలకు 237 కోట్ల రూపాయలు, మొత్తం ప్రాధాన్యతా రంగాలకు 4 వేల 60 కోట్ల రూపాయలు లక్ష్యంగా నిర్ణయించగా ప్రాధాన్యేతర రంగాలకు 299 కోట్ల రూపాయలు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని, ఆర్ధిక సంవత్సరానికి గాను మొత్తం 4 వేల 359 కోట్ల రూపాయలు రుణాలను లక్ష్యంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. 8 వేల 333 గ్రామీణ స్వయం సహాయక సంఘాలకు గాను 394 కోట్ల రూపాయలు, పి.ఎం.ఎఫ్.ఎం.ఈ. యూనిట్ల వార్షిక లక్ష్యం సాధించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సి.డి. రేషియో 92.1 శాతంగా ఉందని, రబీ సీజన్లో పంట రుణాల లక్ష్యాన్ని సాధించాలని, వ్యవసాయ దీర్ఘకాలిక రుణాల లక్ష్యం 609 కోట్ల రూపాయలకు గాను 382 కోట్ల రూపాయలు సాధించడం జరిగిందని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అందించే రుణ సదుపాయం వార్షిక లక్ష్యం 687 కోట్ల రూపాయాలు కాగా ఇప్పటి వరకు 349 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. ప్రాధాన్యేతర రంగాల రుణ వార్షిక లక్ష్యం 299 కోట్ల రూపాయలకు గాను 427 శాతంతో 1 వేయి 277 కోట్ల రూపాయల రుణాలు అందించడం జరిగిందని తెలిపారు. 9 వేల 364 స్వయం సహాయక సంఘాలకు అందించే వార్షిక రుణ లక్ష్యం 488 కోట్ల రూపాయలు కాగా 6 వేల 260 సంఘాలకు 378 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ముద్ర రుణ సదుపాయం క్రింద 4 వేయి 159 మంది లబ్దిదారులకు 84 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 90 యూనిట్ల లక్ష్యంకు గాను 118 యూనిట్లకు రాయితీ రుణాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఎస్.సి. కార్పొరేషన్ పథకంలో భాగంగా 2016-17, 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను 91 మంది లబ్దిదారులకు సంబంధించి గ్రౌండింగ్ చేయవలసి ఉ ందని, జిల్లాలో ఎన్.పి.ఎ. క్రింద 117 కోట్ల రూపాయలు వసూలు చేయవలసి ఉందని, ఎస్.టి. కార్పొరేషన్ రుణాలను సకాలంలో గ్రౌండింగ్ చేయాలని, సంబంధిత అధికారులు ఆ దిశగా దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రభుత్వం రైతులు, వ్యాపారస్తులు, పి.ఎం. ఈ.జి.పి.ఎస్.సి., ఎస్.టి. కార్పొరేషన్లతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పథకాల కోసం అభ్యర్థులు చేసుకున్న దరఖాస్తులను త్వరగా పరిశీలించి పరిష్కరించే విధంగా కృషి చేయాలని తెలిపారు.
వ్యవసాయ సాగుకు సంబంధించి రుణాలు పొందిన రైతులు సకాలంలో తిరిగి చెల్లించి అవసరమైన నూతన రుణాలు పొందేలా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను పొటెన్షియల్ సంబంధిత విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, ఆర్.బి.ఐ. ఎల్.డి.ఓ. అనిల్ కల్బోర్గ్, నాబార్డు డి.డి. ఎం. అబ్దుల్ రవూఫ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ గౌతమ్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ మురళీమనోహర్రావు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎ.జి.ఎం. సాజిబ్ కుమార్ సాహు, ఎ.డి.సి.సి. బ్యాంక్ ఎ.జి.ఎం. మీర్జా ఇంతియాజ్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
